టెన్త్‌ పరీక్షలు వాయిదా?

ABN , First Publish Date - 2020-03-22T09:04:13+05:30 IST

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ రోజురోజుకూ విశ్వరూపం ప్రదర్శిస్తుండటమే ఇందుకు కారణం. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ తీవ్రతకు డెడ్‌లైన్‌ లేదన్న....

టెన్త్‌ పరీక్షలు వాయిదా?

  • కరోనా వ్యాప్తికి ఇప్పట్లో బ్రేకు పడబోదన్న సంకేతాలు
  • లక్షలాది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి
  • 31 నుంచి పరీక్షలు మంచిది కాదంటున్న నిపుణులు


అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ రోజురోజుకూ విశ్వరూపం ప్రదర్శిస్తుండటమే ఇందుకు కారణం. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ తీవ్రతకు డెడ్‌లైన్‌ లేదన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రభుత్వం, ప్రజలు తీసుకునే నివారణ చర్యలను బట్టి నియంతణ్ర ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులకు పరీక్షలు నిర్వహించడం వల్ల ... సెంటర్ల వద్ద వారు గుంపులుగా చేరడం అనివార్యం కావచ్చు. ఒకవైపు సామాజిక దూరం పాటించాలన్న సందేశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో పరీక్షల సందర్భంగా పిల్లలు గుంపులు గుంపులుగా చేరడం వల్ల నష్టం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం తాజాగా సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకూ పరీక్షలు జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు దాదాపు 6.4 లక్షల మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. కానీ యావత్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్‌ ఎంతకాలం ప్రభావం చూపుతుందో వైద్యులకు సైతం అంతుబట్టని పరిస్థితులు నెలకొన్నాయి.


ఆ తీవ్రత దృష్ట్యానే దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, హాస్టళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. సమీప భవిష్యత్తులో అవి తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. పలు రాష్ట్రాల్లో విద్యార్థులు హాజరయ్యే అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశారు. జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయు. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా వార్షిక పరీక్షలనే రద్దు చేశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ హైకోర్టు ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్షలను ఈ నెల 30 వరకూ వాయిదా వేశారు. ఆ తర్వాత జరగాల్సిన పరీక్షల విషయమై ఈ నెల 29న సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ వాదన మరో రకంగా ఉంది. ఇప్పటికే ఒకసారి పరీక్షలను ఈ నెల 31 నుంచి జరిగేలా రీ షెడ్యూల్‌ చేశామని, ఈ లోగా కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుతుందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పరీక్షలకు ముందుగానే కరోనా తీవ్రతపై సమీక్షించి వాయిదా వేయాల్సిన అవసరం ఉందా, లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. కానీ పరీక్షల కంటే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమన్న భావనతో తల్లిదండ్రులు ఉన్నట్లు సమాచారం. ఈ వాతావరణంలో విద్యార్థులను పరీక్షల టెన్షన్‌కు గురిచేయడం క్షేమం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయు. ఈ నెల 30లోగా కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ... 31 నుంచే పదో తరగతి పరీక్షలు నిర్వహించరాదని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - 2020-03-22T09:04:13+05:30 IST