అనంతలో.. బీభత్సకాండ..!

ABN , First Publish Date - 2021-11-09T13:20:56+05:30 IST

అది దశాబ్దాల చరిత్ర ఉన్న కళాశాల! అనంతపురం పట్టణంలో... ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ పేరుతో విద్యా సేవ అందిస్తోంది. ఎయిడెడ్‌ సంస్థగా తక్కువ ఫీజులకే చదువులు చెబుతోంది. సర్కారు వారి ‘ఎయిడెడ్‌’ విధానంతో... ప్రైవేటు సంస్థగా మారేందుకు సిద్ధమైంది. దీంతో తమపై అధిక ఫీజుల భారం పడుతుందంటూ..

అనంతలో.. బీభత్సకాండ..!

విద్యార్థులపై లాఠీ

అనంతలో ఎయిడెడ్‌ ఉద్యమంపై జులుం

శాంతియుత ఆందోళనలో బీభత్సకాండ

ఎస్‌ఎస్‌బీఎన్‌ ‘ప్రైవేటు’పరంపై నిరసనలు

కాలేజీలోనే ఉన్నప్పటికీ పోలీసు కట్టడి

చొక్కాలు పట్టుకుని పిడిగుద్దుల వర్షం

సొమ్మసిల్లిన విద్యార్థిని.. 15 మందికి గాయాలు

ఫోన్‌లో లోకేశ్‌ పరామర్శ.. రేపు అనంతకు


అనంతపురం: అది దశాబ్దాల చరిత్ర ఉన్న కళాశాల! అనంతపురం పట్టణంలో... ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ పేరుతో విద్యా సేవ అందిస్తోంది. ఎయిడెడ్‌ సంస్థగా తక్కువ ఫీజులకే చదువులు చెబుతోంది. సర్కారు వారి ‘ఎయిడెడ్‌’ విధానంతో... ప్రైవేటు సంస్థగా మారేందుకు సిద్ధమైంది. దీంతో తమపై అధిక ఫీజుల భారం పడుతుందంటూ సోమవారం విద్యార్థులు నిరసనకు దిగారు. ఎయిడెడ్‌ కాలేజీగానే కొనసాగించాలంటూ పిడికిలి బిగించిన పిల్లలపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీలు ఝళిపించారు. ప్రతిఘటించిన  విద్యార్థులపై పిడిగుద్దులు కురిపించారు. మోచేతులతో డొక్కల్లో పొడిచారు. చొక్కాలు పట్టి లాగేశారు. ఈడ్చి వాహనాల్లోకి నెట్టారు.


కాలేజీని కాపాడుకునేందుకు...

ఎయిడెడ్‌ కాలేజీలను విలీనం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... ఎస్‌ఎస్‌బీఎన్‌ (శ్రీసాయిబాబా నేషనల్‌ కాలేజీ) ఎయిడెడ్‌ విద్యాసంస్థకు ఇటీవల తాఖీదులు పంపింది. తాము కళాశాల ఆస్తులను అప్పగించబోమని, సిబ్బందిని మాత్రం ప్రభుత్వానికి ఇచ్చేసి... కాలేజీని ప్రైవేటుగా నడుపుకొంటామని యాజమాన్యం తెలిపింది. కాలేజీ ప్రైవేటు సంస్థగా మారితే ఫీజుల భారం పడటంతోపాటు.. అనుభవజ్ఞులైన సిబ్బంది కూడా దూరమవుతారని విద్యార్థులు ఆందోళన చెందారు. దీనిపై సోమవారం నిరసన తెలపాలని నిర్ణయించారు. అదికూడా... కాలేజీ ఆవరణకే పరిమితం చేశారు. సోమవారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో వందలాది మంది విద్యార్థులు కాలేజీ ఆవరణలోనే నిరసనకు దిగారు. ఎస్‌ఎఫ్ఐ, ‘తెలుగు విద్యార్థి’ సహా పలు సంఘాలు వీరికి మద్దతు పలికాయి. ‘ఎయిడెడ్‌ కావాలి... ప్రైవేట్‌ వద్దు’, ‘ఆపాలి.. ఆపాలి ప్రైవేటీకరణ’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. 


విద్యార్థి నేతల అరెస్టుతో..

కాలేజీ ఆవరణలో విద్యార్థులు నిరసన చేస్తున్న ప్రాంతానికి పోలీసులు వచ్చారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన విద్యార్థి సంఘాల నేతలపై ముందుగా దృష్టి సారించారు. ఎస్‌ఎఫ్ఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని తీసుకెళుతున్న పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు. కాలేజీ మెయిన్‌గేటు మూసివేసి.. నాయకులను అరెస్టు చేయవద్దంటూ అక్కడే కూర్చున్నారు. అంతే.. ఒక్కసారిగా పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఈ క్రమంలో కొన్ని రాళ్లు పడ్డాయి. ఆ వెంటనే లాఠీలతో విద్యార్థులను చితకబాదారు. విద్యార్థులు అన్న విషయం కూడా మర్చిపోయి చొక్కా కాలర్‌ పట్టుకుని కొట్టారు. ఈ క్రమంలో బీఏ చివరి సంవత్సరం విద్యార్థిని జయలక్ష్మి తలకు గాయాలయ్యాయి. 15 మంది కూడా క్షతగాత్రులయ్యారు. లాఠీలు పట్టుకొని రోడ్డుపై విద్యార్థులను పరుగులు తీయించారు. తీవ్రంగా ప్రతిఘటిస్తున్నవారిని చెల్లాచెదురుచేసి.. ఆరుగురు విద్యార్థులను, నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసినవారిలో టీఎన్‌ఎస్ఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి పరశురాం తదితరులు ఉన్నారు. వీరందరిపై కేసులు పెట్టి మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళన, లాఠీచార్జిని కవర్‌ చేయడానికి వెళ్లిన మీడియాపై పోలీసులు దుసురుగా వ్యవహరించారు. విద్యార్థులు ఏం చేశారు? అలా కొడితే ఎలా సార్‌ అంటూ అడిగిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులను సైతం బలవంతంగా అక్కడినుంచి ఈడ్చేశారు.  


ఫోన్‌లో లోకేశ్‌ పరామర్శ

పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ఫోన్‌లో పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి జయలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమని, విద్యార్థులను ఉగ్రవాదుల్లా నిర్బంధించి దాడిచేశారన్నారు. పెడరెక్కలు విరిచి పట్టుకుని, జీపుల్లో కుక్కి తీసుకెళ్లారంటూ కొందరు విద్యార్థులు ఆయనకు జరిగిన దారుణాన్ని వివరించారు. 


జాతీయ స్ఫూర్తితో..

అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు జాతీయ స్ఫూర్తితో 1942లో బీజం పడింది. సిరివరం ఆదినారాయణ రావు అనేదాత ‘ద అనంతపురం జిల్లా నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు’ పేరుతో ఈ సంస్థలకు శ్రీకారం చుట్టారు. 1944లో ఎలిమెంటరీ స్కూల్‌ ఏర్పాటుచేశారు. 1945లో దానిని హైస్కూల్‌గా, 1969లో జూనియర్‌ కళాశాలగా, 1981లో డిగ్రీ కళాశాలగా మార్చారు. ప్రస్తుతం ఎయిడెడ్‌ హైస్కూల్‌లో 338 మంది విద్యార్థులు చదువుతుంటే.. 11 మంది స్టాఫ్‌ ఉన్నారు. 



Updated Date - 2021-11-09T13:20:56+05:30 IST