వీరే ‘బెస్ట్‌’

ABN , First Publish Date - 2020-06-04T09:28:22+05:30 IST

రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్ర ఆసుపత్రి (మహారాజా ఆసుపత్రి), జిల్లా స్థాయిలో శృంగవరపుకోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రులు ..

వీరే ‘బెస్ట్‌’

జిల్లాకు కాయకల్ప అవార్డులు

రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి గుర్తింపు

జిల్లా స్థాయిలో ఎస్‌.కోట సీహెచ్‌సీకి అవార్డు


శృంగవరపుకోట, జూన్‌ 3:  రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్ర ఆసుపత్రి (మహారాజా ఆసుపత్రి), జిల్లా స్థాయిలో శృంగవరపుకోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రులు  ఈ ఏడాది కాయకల్ప బెస్ట్‌ అవార్డులు సాధించాయి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌లో భాగంగా ఏటా ఆస్పత్రులకు ఈ అవార్డులను ప్రకటిస్తోంది. ఈ రెండింటితో పాటు బెస్ట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా గర్భాం, బెస్ట్‌ హెల్త్‌ వెల్ఫేర్‌ సెంటర్‌గా పాయకపాడులు ఎంపికయ్యాయి. కేంద్ర ఆసుపత్రి అభివృద్ధికి రూ.15 లక్షలు, ఎస్‌.కోట సీహెచ్‌సీకి రూ. 5లక్షలు, గర్భాం పీహెచ్‌సీకి రూ.లక్ష, పాయకపాడు హెల్త్‌ వెల్ఫేర్‌ సెంటర్‌కు రూ.50వేలు అభివృద్ధి నిధులు ఇవ్వనున్నారు.


వీటితో పాటు జిల్లాలో రన్నరప్‌గా నిలిచిన చినమేరంగి సీహెచ్‌సీకి రూ.2 లక్షలు, కమండేషన్‌ (ప్రశంస) అవార్డుకు ఎంపికైన చీపురుపల్లి సీహెచ్‌సీకి రూ.లక్ష, గంట్యాడ, మక్కువ, పూసపాటిరేగ పీహెచ్‌సీలకు రూ.50వేలు, ఫస్ట్‌ రన్నరప్‌లో ఉన్న మాటుమూరు, సెకెండ్‌ రన్నరప్‌లో ఉన్న లక్కిడాం ఆస్పత్రులకు రూ.25వేలు చొప్పున ప్రభుత్వం అభివృద్ధి నిధులు ప్రకటించింది.  జిల్లా కేంద్ర ఆసుపత్రికి గతంలోనూ రాష్ట్ర స్థాయిలో కాయకల్ప అవార్డు దక్కింది. ఎస్‌.కోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి కూడా వరుసగా ఈ అవార్డు రెండోసారి వచ్చింది. అంతకుముందు 2017-2018లో రాష్ట్ర స్థాయి కాయకల్ప అవార్డుకు ఎస్‌.కోట సీహెచ్‌సీ ఎంపికైంది. 2017 నుంచి 2020 మధ్యలో మూడుసార్లు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఈ సీహెచ్‌సీ కాయకల్ప అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులను ఏటా ప్రకటిస్తోంది.


ఇందుకోసం ఆస్పత్రుల్లో పరిశుభ్రతతో పాటు వ్యర్థాల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై ప్రత్యేక బృందం తనిఖీలకు వస్తుంది. పరిశీలనలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణతో పాటు పారిశుధ్య నిర్వహణలో కార్మికులకున్న అవగాహనను పరిశీలిస్తారు. వ్యర్థాలు తొలగించేటప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలను చూస్తారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, వైద్యులు, సిబ్బంది పనితీరును అంచనా వేస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు, అంటువ్యాధులపై అవగాహన కార్యక్రమాల నిర్వహణపైనా ఆరా తీస్తారు. ఇలా అనేక అంశాల్లో మెరుగ్గా ఉన్న ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులను ఇస్తారు.  ఈ అవార్డులు ప్రకటిస్తున్న నాటి నుంచి శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రి ఏదో ఒక అంశంలో అవార్డును పొందుతోంది. తొలి ఏడాది రెండో స్థానంలో నిలిచిన ఈ సీహెచ్‌సీ ఆ తరువాత నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మెదటి వరుసలో ఉంటోంది. 


వైద్యులు, సిబ్బంది కృషితోనే..డాక్టర్‌ రంధి త్రీనాఽథరావు, సూపరెంటెండెంట్‌, సామాజిక ఆసుపత్రి, ఎస్‌.కోట 

 తోటి వైద్యులు, సిబ్బంది కృషితో ఏటా కాయకల్ప అవార్డును సాధిస్తున్నాం. ఈ ఏడాది కూడా సీహెచ్‌సీకి జిల్లాలో మెదటి స్థానం రావడం అనందంగా ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు అసుపత్రి పరిసరాలను శుభ్రంగా  ఉంచుతారు. వ్యర్థాల నిర్వహణపైనా వారికి సమగ్ర అవగాహన ఉంది. గతంలో వచ్చిన కాయకల్ప నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి చేశాం. అభివృద్ధి పనులకు ఈ నిధులు దోహదపడుతున్నాయి. 

                 

Updated Date - 2020-06-04T09:28:22+05:30 IST