వైవిధ్యమైన కథాంశాలతో, విలక్షణమైన పాత్రలు పోషించడంలో యంగ్ హీరో శ్రీవిష్ణు దిట్ట. చివరగా ఈ హీరో ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తాజగా ‘భళాదంతనాన’ అనే క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ‘బాణం, బసంతి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ‘చైతన్య దంతులూరి’ ఈ సినిమాకి దర్శకుడు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మొన్నీమధ్యే టాకీపార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ను నేచురల్ స్టార్ నానీ చేతులమీదుగా విడుదల చేశారు. ఆసక్తికరమైన సన్నివేశాలతో టీజర్ ను కట్ చేశారు.
‘రాక్షసుడ్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి. నేను మామూలు మనిషిని’ అనే శ్రీవిష్ణు వాయిస్ పై టీజర్ మొదలవుతుంది. విలన్‌గా గరుడ రామ్ ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ఒక వ్యక్తి (ఆదర్శ్ బాలకృష్ణ) మర్డర్ అవుతాడు. పోలీసులు ఇన్వెస్ట్ గేట్ చేస్తుంటారు. మీడియా హడావిడి చేస్తూంటుంది. ఫోటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డి కామెడీ. న్యూస్ వెబ్ సైట్ లో హీరో శ్రీవిష్ణు పనిచేస్తున్నట్టు రివీలవుతుంది. హీరోయిన్ కేథరిన్ ట్రెస్సా ఎంట్రీ. ‘నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మేన్‌కి కూడా రిస్కే’ అని హీరోతో డైలాగ్ చెబుతుంది. రాజకీయ కుట్రతో అమాయకుడైన హీరోని ఆ మర్డర్ కేసులో ఇరికిస్తారని.. మిగతా విజువల్స్ ను బట్టి అర్ధమవుతోంది. మొత్తానికి ఆసక్తికరమైన కథాకథనాలతో సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. మరి దర్శకుడిగా చైతన్య దంతులూరి ఈ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.