స్వర్ణరథంపై శ్రీవారు

ABN , First Publish Date - 2022-01-14T08:59:29+05:30 IST

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు టికెట్లు, టోకెన్లు కేటాయించడంతో గురువారం కొండకు భక్తుల తాకిడి తక్కువగానే కనిపించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక తిరుప్పావైతో శ్రీవారిని..

స్వర్ణరథంపై శ్రీవారు

  • ప్రశాంతంగా ఏకాదశి దర్శనం
  • రాత్రి 12.45 గంటల నుంచే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు 
  • స్వామిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు
  • పలు హైకోర్టుల సీజేలు, రాజకీయ ప్రముఖులు కూడా


తిరుమల, జనవరి 13(ఆంధ్రజ్యోతి): తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు టికెట్లు, టోకెన్లు కేటాయించడంతో గురువారం కొండకు భక్తుల తాకిడి తక్కువగానే కనిపించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. 12.45 గంటలకు శ్రీవారి దర్శనాలు మొదలయ్యాయి. దాదాపు 7 గంటల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనాలు జరిగాయి. సుప్రీంకోర్టు, తెలంగాణ, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. 3,687 మందికి వీఐపీ బ్రేక్‌ టికెట్లు మంజూరు చేయగా, శ్రీవాణి ట్రస్టు దాతలకు 2,666 టికెట్లు ఇచ్చారు. ఉదయం 7.30 గంటలకు సామాన్య భక్తుల దర్శనాలను మొదలుపెట్టారు.


స్లాట్ల ప్రకారం టికెట్లు కేటాయించడంతో భక్తులు ఆ సమయానికి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై కొలువుదీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులతో పాటు కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్‌ రీతూరాజ్‌ అవస్థి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు స్వర్ణరథాన్ని లాగారు. శనివారం ద్వాదశి సందర్భంగా పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. 



ఆలయ మహాద్వారం వద్ద భక్తుల ధర్నా

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాద్వారం వద్ద గురువారం రాత్రి పలువురు భక్తులు ధర్నాకు దిగారు. సరైన ఏర్పాట్లు చేయలేదంటూ టీటీడీతో పాటు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం, టీటీడీ చైర్మన్‌, ఈవో, అదనపు ఈవో డౌన్‌డౌన్‌ అంటూ క్యూ లైన్లో నినాదాలు చేశారు. కొంతమంది భక్తులు మహాద్వారం వద్ద కూర్చుని నిరసన తెలిపారు. దాదాపు ఐదారు గంటల పాటు క్యూలైన్లోనే నిలబడి ఉన్నామని, కనీసం తాగడానికి నీళ్లు, ఆహారం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సమాధానం చెప్పే వారెవరూ లేరంటూ ఆగ్ర హం వ్యక్తంచేశారు. టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పి ఆలయంలోకి పంపారు.




శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. వేకువజాము కైంకర్యాల అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం చేసి రంగనాయక మండపానికి చేరుకోగా టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌, హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ సతీ్‌షచంద్ర శర్మ, కర్ణాటక హైకోర్టు సీజే రీతూ రాజ్‌ అవస్థి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయలక్ష్మి, జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ రమేష్‌, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, ఏపీ ఉన్నత విద్య రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోవిందరాజన్‌, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్నాథ గౌడ్‌, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దినే్‌షకుమార్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.


శ్రీవారి సేవలో నేతలు..

తెలుగురాష్ర్టాల పలువురు రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు వెలంపల్లి, జయరామ్‌, గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, అవంతి శ్రీనివాస్‌, రంగనాథరాజు, బాలినేని, ఆదిమూలపు సురేశ్‌, వేణుగోపాలకృష్ణ, అప్పలరాజు, ఎంపీలతో పాటు తెలంగాణ మంత్రులు శ్రీనివా్‌సయాదవ్‌, హరీ్‌షరావు తదితరులు వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు.


Updated Date - 2022-01-14T08:59:29+05:30 IST