తాళ్లపాకలో శ్రీవారి కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2022-05-17T05:14:30+05:30 IST

అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం తాళ్లపాకలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు.

తాళ్లపాకలో శ్రీవారి కల్యాణోత్సవం
కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న వేద పండితులు

అలరించిన అన్నమయ్య సంకీర్తనా గోష్టిగానం 

వాహనంలోనే ఊంజల సేవ కార్యక్రమం 

తక్కువ సంఖ్యలో హాజరైన భక్తులు


రాజంపేట/రాజంపేట టౌన్‌, మే 16: అన్నమయ్య 614వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం తాళ్లపాకలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఉత్సవవరులను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శాస్త్రోక్తంగా స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యాహవచనం, పవిత్రహోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళశాసనం ఘట్టాలతో కల్యాణం నిర్వహించారు. వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నక్షత్ర హారతి, మంగళహారతి కార్యక్రమాలతో కల్యాణాన్ని ముగించారు. ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు,  మజ్జిగ, ప్రసాదాలు పంపిణీ చేశారు. కల్యాణోత్సవానికి ముందు అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు నాదస్వర సమ్మేళనం, సప్తగిరి సంకీర్తనాగోష్టిగానం కార్యక్రమాలు నిర్వహించారు.


వాహనంలోనే ఊంజల సేవ

అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద ఊంజల సేవకు సంబంధించిన ఊయల విరిగి పడిపోవడం, దానివల్ల ఒకరు మృతి చెంది ముగ్గురు గాయపడటంతో వేదిక వద్దే ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసి తాత్కాలిక ఊయలను ఏర్పాటు చేసి టీటీడీ వాహనంలోనే ఊంజల సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరుజల్లులు కురుస్తూ ఉండటం, విగ్రహం వద్ద కూడా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం, ఉత్సవాల్లో అపశ్రుతి జరగడం తదితర కారణాల వల్ల ఊంజల సేవా కార్యక్రమానికి కూడా భక్తులు అతిస్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి విజయ్‌సారధి, ఏఈవో సత్యనారాయణ, కార్యక్రమ అసిస్టెంట్‌ లత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:14:30+05:30 IST