శ్రీవారి అన్నం..వైసీపీ దానం!

ABN , First Publish Date - 2020-04-05T15:46:02+05:30 IST

శ్రీవారి అన్నం..వైసీపీ దానం!

శ్రీవారి అన్నం..వైసీపీ దానం!

ఆహారం తయారీ మాత్రమే తమ బాధ్యతంటున్న టీటీడీ   

వైసీపీ నాయకులకొదిలేసిన కార్పొరేషన్‌, రెవెన్యూ అధికారులు   

తిరుపతి(ఆంధ్రజ్యోతి):సర్వం లాక్‌డౌన్‌ అయిన ప్రస్తుత పరిస్థితుల్లో తిరుపతిలో తిండికి ఇబ్బంది పడుతున్న పేదలకు టీటీడీ అన్నప్రసాదాలను పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది.రోజూ మధ్యాహ్నం 30వేలు, రాత్రి 15వేల చొప్పున నిత్యం 45 వేల ఆహారప్యాకెట్లను సిద్ధం చేస్తోంది.అయితే  అధికార పార్టీ మాత్రం టీటీడీ దాతృత్వాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. టీటీడీ పరిపాలన భవనం, శ్రీనివాసం ప్రాంతాల్లో తయారవుతున్న ఆహార ప్యాకెట్లను ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి తనయుడు అభినయ రెడ్డి దగ్గరుండి  సిద్ధం చేయిస్తున్నారు.    ఆహార ప్యాకెట్లను నగరంలోని 50 డివిజన్లకు చెందిన వైసీపీ నాయకుల అనుచరులను పిలిపించి అందజేస్తున్నారు. ఒక్క బాక్సుకు 50 ప్యాకెట్ల చొప్పున వార్డును బట్టి 5 బాక్సుల నుంచి 10 బాక్సుల వరకు ఆటోల్లో పంపుతున్నారు.ఆ ఆహార పొట్లాలను తమకు తోచిన ప్రాంతాల్లో వైసీపీ నాయకులు పంచి పెడుతుండడం విమర్శలకు దారితీస్తోంది.అన్నార్తులు, మురికివాడలుండే ప్రాంతాల్లోనే కాకుండా రెడ్డి అండ్‌  రెడ్డి కాలనీ, బైరాగిపట్టెడ వంటి పోష్‌ ఏరియాల్లో కూడా వైసీపీ నాయకులు దగ్గరుండి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తూ ఫొటోలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.    వేలాదిమంది ఉద్యోగులున్న టీటీడీకి ఆహారపొట్లాల పంపిణీ సమస్య కాదు.


  అయితే తాము ఆహారాన్ని తయారుచేయడం వరకేనని పంపిణీ ఏర్పాట్లను కార్పొరేషన్‌, రెవెన్యూ అధికారులు చూసుకుంటారని టీటీడీ చెబుతోంది.అయితే కార్పొరేషన్‌, రెవెన్యూ అధికారులు ఒక్కరు కూడా అటువైపు తొంగిచూసినట్టు లేదు.స్వచ్ఛందంగా సేవలందిస్తున్నాం అనే పేరుతో వైసీపీ పంపిణీ బాధ్యతలు చేపట్టింది.కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారి పార్టీ అభ్యర్థులతో ఆహార పొట్లాలను పంపిణీ చేయిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

Updated Date - 2020-04-05T15:46:02+05:30 IST