Abn logo
Sep 26 2021 @ 02:00AM

ఇంటర్నెట్‌ సెంటర్లకు పోటెత్తిన శ్రీవారి భక్తులు

తిరుపతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతి శ్రీనివాసంలో శనివారం వరకు శ్రీవారి దర్శన టోకెన్లను టీటీడీ ఇస్తుందన్న నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కానీ టోకెన్లు ఇవ్వడం లేదని తెలిశాక ఆన్‌లైన్‌లో అయినా టికెట్లు బుక్‌ చేసుకోవాలని సమీప ఇంటర్నెట్‌ సెంటర్లకు శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్యూ కట్టారు. ఉదయం షాపు తెరవడానికి వచ్చిన ఇంటర్నెట్‌ సెంటర్‌ నిర్వాహకులు ఇంతమందిని చూసి బిత్తరపోయారు. ఆన్‌లైన్‌లో పది టికెట్లు బుక్‌ చేయటానికి చాలా ఓపిక ఉండాలని, ఇలా వందలాదిమందికి బుక్‌ చేయడం కష్టమని చెప్పినా భక్తులు వినే పరిస్థితి కనిపించలేదు. దీనివల్ల చాలామంది షాపులు ఓపెన్‌ చేసే ధైర్యం కూడా చేయలేదు. పైగా తమ మిత్రులను పిలిపించుకుని షాపులకు కాపలాగా ఉండటం కనిపించింది. మరోవైపు టీటీడీ ఉచిత టోకెన్లు రిలీజ్‌ చేయటం, కొద్ది గంటలకే అయిపోవడం జరిగిపోయింది. ఈ విషయం తెలిసిన భక్తులు బాధతో ఇంటర్నెట్‌ సెంటర్ల నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉంటే.. టీటీడీ అధికారులు ఈనెల 22వ తేదీనే టోకెన్లు అయిపోయిన విషయం విశేషంగా ప్రచారం చేయక పోవడిన్ని భక్తులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.