శ్రీవారి దర్శన టిక్కెట్లు ఇప్పిస్తానంటూ నగదుతో ఉడాయించిన వృద్ధుడు

ABN , First Publish Date - 2021-10-19T07:39:32+05:30 IST

శ్రీవారి దర్శన టిక్కెట్లు ఇప్పిస్తానంటూ ఓ వృద్ధుడు భక్తుల నుంచి నగదు తీసుకుని ఉడాయించిన వృద్ధుడు.. రెండు రోజుల తర్వాత

శ్రీవారి దర్శన టిక్కెట్లు ఇప్పిస్తానంటూ   నగదుతో ఉడాయించిన వృద్ధుడు
రుయా భద్రతా సిబ్బంది అదుపులో నిందితుడు

రెండు రోజుల తర్వాత గుర్తించి పట్టుకున్న రుయా సిబ్బంది


తిరుపతి(నేరవిభాగం)/తిరుపతి సిటీ, అక్టోబరు 18: శ్రీవారి దర్శన టిక్కెట్లు ఇప్పిస్తానంటూ ఓ వృద్ధుడు భక్తుల నుంచి నగదు తీసుకుని ఉడాయించిన వృద్ధుడు.. రెండు రోజుల తర్వాత దొరికాడు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనార్థం ఈనెల 16వ తేది సాయంత్రం అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్దకు వచ్చారు. దర్శన టిక్కెట్లకోసం పలువురిని వాకబు చేయడాన్ని గమనించిన వృద్ధుడు.. దర్శన టిక్కెట్లు ఇప్పిస్తానంటూ వారివద్ద రూ.5వేల నగదు తీసుకున్నాడు. రుయాస్పత్రిలో ఉన్న బంధువులను చూసి వచ్చేస్తానంటూ బయలుదేరాడు. ఆ భక్తులు కూడా అతడిని అనుసరిస్తూ రుయా వరకు వెళ్లారు. టిక్కెట్లు ఇప్పిస్తానన్న వ్యక్తి ఆస్పత్రిలోకి వెళ్లడంతో వీరు బయటే ఉన్నారు. అతడు ఎంతకూ రాకపోవడంతో అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుయా భద్రతాసిబ్బందితో కలిసి పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటేజీలో భక్తులు చూపించిన నిందితుడు ఆస్పత్రిలో కనిపించకపోవడంతో పోలీసులు, రుయా భద్రతా సిబ్బంది నిఘాపెట్టారు. ఈ క్రమంలో ఫుటేజీలోని వ్యక్తిని సోమవారం రుయాస్పత్రిలో గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, రూ.5350 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుతోపాటు భక్తులను మోసగించిన వ్యక్తిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. రుయా సూపరింటెండెంట్‌ భారతితోపాటు అలిపిరి పోలీసులు సెక్యూరిటీ సిబ్బందిని అభినందించారు. కాగా, నిందితుడు కార్వేటినగరం మండలం వేదివారిపల్లెకు చెందిన రమణ (65)గా విచారణలో తెలిసిందని సీఐ తెలిపారు. అతడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2021-10-19T07:39:32+05:30 IST