ఎల్లుండి నుంచే శ్రీవారి దర్శనం

ABN , First Publish Date - 2020-06-06T09:31:02+05:30 IST

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రద్దుచేసిన శ్రీవారి దర్శనాలను సోమవారం నుంచి ప్రారంభించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎల్లుండి నుంచే  శ్రీవారి దర్శనం

  • 3రోజులు ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌రన్‌ 
  • 11నుంచి భక్తులందరికీ అనుమతి 
  • రోజుకు 6వేల మందికే అవకాశం 
  • ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో 3వేలు చొప్పున టికెట్లు 
  • జూన్‌ ఆన్‌లైన్‌ టికెట్ల కోటా 8న విడుదల
  • వృద్ధులు, పదేళ్లలోపు చిన్నపిల్లలకు నో ఎంట్రీ 
  • గ్రామ సచివాలయాల్లోనూ టికెట్ల బుకింగ్‌ 
  • ఉదయం గంటపాటు వీఐపీ బ్రేక్‌ 
  • 8నుంచి లడ్డూల బల్క్‌ బుకింగ్‌ రద్దు 
  • టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి 


తిరుమల, జూన్‌ 5: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా రద్దుచేసిన శ్రీవారి దర్శనాలను సోమవారం నుంచి ప్రారంభించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 80రోజుల తర్వాత స్వామి దర్శనాలు ప్రారంభిస్తున్నామన్నారు. 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు, 10న తిరుమలలో స్థానికులకు ట్రయల్‌రన్‌ కింద దర్శనం కల్పిస్తామన్నారు. 11నుంచి భక్తులందరినీ అనుమతిస్తామన్నారు. 65ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలకు దర్శనం లేదన్నారు. రోజూ 6వేల మందికి దర్శనం కేటాయిస్తామని, ఇందులో 3వేలు ఆన్‌లైన్‌ (రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం)లో, మరో 3వేలు ఆఫ్‌లైన్‌ ద్వారా తిరుపతిలోని ఎస్‌ఎ్‌సడీ కౌంటర్లలో ఒకరోజు ముందు కేటాయిస్తామన్నారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. తొలిగంట స్వయంగా వచ్చే వీఐపీలకు బ్రేక్‌ దర్శనం ఉంటుందని, ఎలాంటి సిఫారసులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలకు చెందిన వారు తిరుమలకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.


మరికొన్ని నిర్ణయాలు...

  1. 11నుంచి మొదలయ్యే ఆన్‌లైన్‌ దర్శనం జూన్‌ కోటా టికెట్లు 8న విడుదల. 
  2. గ్రామీణ ప్రాంతాల భక్తులు వలంటీర్ల సహాయంతో సచివాలయాల్లో టికెట్లు బుక్‌ చేసుకొనేలా చర్యలు
  3. ఉదయం 6నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే అలిపిరి మార్గంలో కాలినడక భక్తులకు అనుమతి. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు శ్రీవారిమెట్టు మార్గం మూసివేత. ఉదయం 5నుంచి సాయంత్రం 4గంటల వరకు తిరుపతికి, రాత్రి 8గంటల వరకు తిరుమలకు వెళ్లేందుకు ఘాట్‌రోడ్లలో అనుమతి. తిరుమలలో రాత్రి 9నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలు.
  4. ఆలయంలోని హుండీలో కానుకలు వేసేముందు భక్తులు హెర్బల్‌ శానిటైజర్లు వినియోగించేలా చర్యలు. పుష్కరిణి స్నానం, తీర్థాల సందర్శన రద్దు. దర్శనానంతరం శ్రీవారి ఆలయంలో ఉచితంగా ఇచ్చే ప్రసాదాల వితరణ, తీర్థం, శఠారి తాత్కాలికంగా నిలుపుదల. 
  5. సన్నిధిలోని మూడు క్యూలైన్లు ర్యాండమ్‌గా వినియోగం. ప్రతి 2గంటలకు ఒకసారి శానిటైజ్‌ చేసేలా ప్రణాళిక. ఆలయంలోని ఉపదేవాలయాల దర్శనాలు రద్దు. 
  6. అలిపిరి టోల్‌గేట్‌ వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌, వెహికల్‌ స్కానింగ్‌, హ్యాండ్‌ శానిటైజర్లు ఏర్పాటు. ప్రతి ఒక్కరినీ స్ర్కీనింగ్‌ చేశాక దర్శనం టికెట్టు ఉన్నవారికే తిరుమలకు అనుమతి.  
  7. ఆన్‌లైన్‌లో కేటాయించే గదిలో ఇద్దరికే ప్రవేశం. ఖాళీ అయిన గది శానిటైజేషన్‌ చేసి 12గంటల తర్వాతే ఇతరులకు కేటాయింపు. మరుసటి రోజుకు గది పొడిగింపునకు నిరాకరణ. 
  8. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ. టేబుల్‌కు ఇద్దరు మాత్రమే కూర్చొనేలా ఏర్పాట్లు. 
  9. భక్తులకు దగ్గరగా విధులు నిర్వహించే సిబ్బందికి రోజుకు 500 పీపీఈ కిట్లు అందజేత. 
  10. 8నుంచి లడ్డూల బల్క్‌ బుకింగ్‌ విక్రయాలు రద్దు.
  11. రోజుకు 200మంది భక్తుల నుంచి ర్యాండమ్‌గా శాంపిల్స్‌ తీసుకుని కరోనా పరీక్షల నిర్వహణ. స్విమ్స్‌లో టీటీడీ కోసం ప్రత్యేకంగా కరోనా టెస్టింగ్‌ లేబొరేటరీ ఏర్పాటు. టీటీడీ స్థానిక ఆలయాల్లోనూ భౌతిక దూరంతో దర్శనం.

Updated Date - 2020-06-06T09:31:02+05:30 IST