మయూర వాహనంపై మల్లన్న

ABN , First Publish Date - 2021-03-08T05:38:22+05:30 IST

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు

మయూర వాహనంపై మల్లన్న

  1. భ్రమరాంబతో కలిసి క్షేత్రంలో విహారం
  2. కాణిపాకం, టీటీడీ తరపున పట్టు వస్త్రాల సమర్పణ
  3. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట్ర ప్రభుత్వం


శ్రీశైలం, మార్చా 7: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అలంకార మండపంలో సుగంధపుష్పాలతో అలంకరించిన మయూర వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు.  పధాన అర్చకులు, వేదపండితులు అర్చనలు, పూజలు నిర్వహించి హారతి పట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, సంగీత, నృత్య ప్రదర్శనల నడుమ రాత్రి  ఆలయం రాజగోపురం నుంచి వెలుపలకి తోడ్కొనివచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజాదికాలను నిర్వహించి క్షేత్రవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. కోలాటం, చెక్కభజన, జాంజ్‌ పథక్‌, పగటి వేశాలు, గొరవయ్యలు, బుట్ట బొమ్మల నృత్యాలు, బీరప్పడోలు, తప్పెట్లు, డ్రమ్స్‌, భజంత్రీలు, బంజారా నృత్యం, శంఖానాదాలు గ్రామోత్సవంలో మార్మోగాయి. రాజగోపురం నుంచి గంగాధర మండపం మీదుగా నందిమండపం వరకు, అక్కడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం దాకా గ్రామో త్సవం జరిగింది. మయూర వాహనంపై దర్శినమి చ్చిన భ్రమరాంబ మల్లికార్జునులను భక్తులు కన్నులారా వీక్షించి నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థాన ఈవో కేఎస్‌ రామరావు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 


కాణిపాక గణపతి పట్టువస్త్రాలు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులకు కాణిపాకం గణపతి తరపున దేవస్థానం ఈవో ఎ. వెంకటేష్‌ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. పట్టువస్త్రాలతో వచ్చిన కాణిపాకం ఈవో, సిబ్బంది, అధికారులకు శ్రీశైల దేవస్థానం అధికారులు రాజగోపురం వద్ద స్వాగతం పలికారు.   అర్చకులు పట్టువస్త్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం వేదపండితులు నవీన్‌, కాశ్యప్‌, పర్యవేక్షకులు కోదండపాణి తదితరులు పాల్గొన్నారు. 


తిరుపతి వెంకన్న తరపున..

తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదివారం సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జునులకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాజగోపురం వద్ద దేవస్థానం ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు వారికి స్వాగతం పలికారు. పట్టువస్త్రాలకు పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లకు సమర్పించారు. కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.  

శ్రీగిరిపై నేడు

రాష్ట్ర ప్రభుత్వం తరపున భ్రమరాంబ మల్లికార్జునులకు సోమవారం పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు సోమవారం సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జునులకు రావణవాహన సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. 

Updated Date - 2021-03-08T05:38:22+05:30 IST