శార్వరి.. శుభకరి

ABN , First Publish Date - 2020-03-26T09:04:32+05:30 IST

శార్వరి నామ సంవత్సర ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఆ తరువాత ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుందని శ్రీశైల దేవస్థానం అస్థాన సిద్ధాంతి

శార్వరి.. శుభకరి

ఈ ఏడాది ఆరంభంలోనే ఇబ్బందులు

ఆ తరువాత అన్నీ శుభాలే

శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ

శ్రీశైలం, మార్చి 25: శార్వరి నామ సంవత్సర ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఆ తరువాత ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుందని శ్రీశైల దేవస్థానం అస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు. ఉగాది సందర్భంగా బుధవారం ఆయన పంచాంగం చదివి వినిపించారు. పండుగ రోజున భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రాతఃకాలం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు నిర్వహించారు. స్వామివారి యాగశాలలో రుద్రహోమం, అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిపారు. అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.


రమావాణీసేవిత రాజరాజేశ్వరిగా భ్రమరాంబదేవి

ఉగాది మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం భ్రమరాంబదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని రమావాణీ సేవిత రాజరాజేశ్వరీగా అలంకరించారు. అమ్మవారిని అలంకార మండపంలోకి తొడ్కొని వచ్చి విశేష పూజాదికాలను నిర్వహించారు. చతుర్భుజాలతో అమ్మవారు పాశం, అంకుశం, పద్మం, చెరకుగడను ధరించి దర్శనమిచ్చారు. కాగా.. ఉగాది మహోత్సవాలు గురువారం ముగుస్తాయి. ఈ సాయంత్రం అమ్మవారు భ్రమరాంబదేవి అలంకారంలో దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు కల్యాణోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు.

Updated Date - 2020-03-26T09:04:32+05:30 IST