నిండుతున్న శ్రీశైలం

ABN , First Publish Date - 2021-07-28T08:03:57+05:30 IST

నిండుతున్న శ్రీశైలం

నిండుతున్న శ్రీశైలం

876.60 అడుగులకు చేరిన నీటిమట్టం

నేడు గేట్లు ఎత్తివేత.. సుంకేశుల డ్యాం 22 గేట్లు ఎత్తి నీటి విడుదల


కర్నూలు, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం రిజర్వాయర్‌లోకి భారీగా వరద చేరుతోంది. దీంతో బుధవారం మధ్యాహ్నం గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణయ్య తెలిపారు. మరో 3 రోజుల పాటు  4 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తుందని అంచనా వేశారు. దీంతో నాలుగైదు రోజులు గేట్లు తెరచి ఉంచే అవకాశం ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తే కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉండటంతో జల విద్యుత్‌ కేంద్రం అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. విద్యుదుత్పత్తికి కృష్ణా బోర్డు అనుమతి ఉందని జెన్‌కో సీఈవో సుధీర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర, జూరాల జలాశయాలు నిండుకుండల్లా మారాయి. 


మంగళవారం జూరాల నుంచి 2,98,468, పవర్‌ హౌస్‌ నుంచి 10,717, సుంకేశుల నుంచి 89,103 క్యూసెక్కులు వెరసి 3,98,288 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. శ్రీశైలం వద్ద 3,15,856 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులకుగాను  ప్రస్తుతం 876.6 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగాను ప్రస్తుతం 172.66 టీఎంసీల నీరు చేరింది. అలాగే తెలంగాణ పవర్‌ హౌస్‌ నుంచి 35,315 క్యూసెక్కులు విడుదలవుతుండగా, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స నుంచి 1,688, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 12వేలు, ఇతర ప్రాంతాల నుంచి 2,400 క్యూసెక్కులు వెరసి 51,403 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. మరోవైపు తుంగభద్ర నుంచి నీరు వస్తుండడంతో సుంకేశుల డ్యాం 22 గేట్ల ద్వారా నీటిని మంగళవారం కిందకు విడుదల చేశారు. సుంకేశుల డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, పైనుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావచ్చన్న అంచనాతో అధికారులు సుంకేశుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం గేట్లను ఒక మీటరు మేర ఎత్తి స్పిల్‌ వే ద్వారా 95 వేల క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 800 క్యూసెక్కులు ఇస్తున్నారు. మంగళవారం సాయంత్రం సుంకేశుల వద్ద 90 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం సుంకేశులలో 0.554 టీఎంసీల నీటి నిల్వ స్థిరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.


శ్రీశైలం గేట్ల నుంచి లీకవుతున్న నీరు

కొన్ని రోజులుగా శ్రీశైలం డ్యాం గేట్ల నుంచి నీరు లీకవుతోంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో గేట్లకు మరమ్మతులు చేపట్టినా లీకేజీ ఆగలేదు.  పనుల్లో నిర్లక్ష్యమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే డ్యాం మరమ్మతులు పూర్తి చేశామని అధికారులు చెబుతుండగా,  గేట్ల రబ్బర్‌ సీల్‌ సక్రమంగా గాడిలో బిగించలేదు. దీంతో భారీగా నీరు లీకవుతోందని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై డ్యాం ఎస్‌ఈ వెంకటరమణయ్యను వివరణ కోరగా సీఈ ఆదేశాలుంటేనే వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

Updated Date - 2021-07-28T08:03:57+05:30 IST