విధుల్లో అలసత్వం వీడండి

ABN , First Publish Date - 2020-07-13T11:46:40+05:30 IST

విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని శ్రీశైలం దేవస్థానంలో పనిచేస్తున్న ..

విధుల్లో అలసత్వం వీడండి

 శ్రీశైల దేవస్థాన ఈవో రామరావు

  పరిపాలనా భవనం ఆకస్మిక పరిశీలన


కర్నూలు, జూలై 12(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉంటూ  సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని శ్రీశైలం దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి ఆలయ ఈవో కేఎస్‌ రామరావు సూచించారు. ఆదివారం క్షేత్ర పరిధిలోని అన్ని విభాగాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయ పరిసరాలతోపాటు ప్రసాద విక్రయశాల, అన్నదాన భవనం, వంటశాలలోని శుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. ఇంజనీరింగ్‌, స్టేషనరీ, రెవెన్యూ, డిస్పాచ్‌, జే సెక్షన్‌, ఆలయ విభాగాల్లో కేటాయించిన నిర్ణీత విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించి భక్తులకు ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన సిబ్బందిని హెచ్చరించారు. 


మనోధైర్యమే మందు:

శ్రీశైల దేవస్థాన పరిధిలో ఇటీవల చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొంత మంది పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయని, అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. మనో ధైర్యంతో ఉంటే అదే మందుగా పని చేస్తుందని అన్నారు.  


కరోనా నియంత్రణపై ప్రత్యేక సమావేశం


కర్నూలు (కల్చరల్‌), జూలై 12: శ్రీశైలం దేవస్థానంలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై ఆదివారం ఈవో కేఎస్‌ రామరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు, తహసీల్దార్‌ రాజేంద్రసింగ్‌, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు డాక్టర్‌ ఎం. సోమశేఖర్‌, దేవస్థానం వైద్యులు డాక్టర్‌ బాబు శివప్రకాశ్‌, డాక్టర్‌ ఎన్‌జే హితేష్‌, దేవస్థానం వైద్య విభాగం, భద్రతా విభాగం, శ్రీశైలప్రభ అధికారులు పాల్గొన్నారు. ఈవో మాట్లాడుతూ దేవస్థానంలో కొవిడ్‌ నియంత్రణ చర్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.


ముఖ్యంగా ఉద్యోగులు విధి నిర్వహణలో మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలను దేవస్థానం ప్రచార వ్యవస్థ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని శ్రీశైల ప్రభ సంపాదకుడ్ని ఆదేశించారు. రహదారుల్లో, ఆరుబయట ప్రదేశాల్లో జనాలు గుంపులుగా చేరకుండా ఉండేందుకు అవసరమైన చర్యలతోపాటూ వారికి అవగాహన కల్పించాలని దేవస్థానం భద్రతాధికారిని ఆదేశించారు. డీఎస్పీ వెంకటరావు మాట్లాడుతూ దర్శన క్యూలైన్లు, ప్రసాదాల విక్రయ కేంద్రం తదితర చోట్ల ఎలాంటి లోపం లేకుండా సామాజిక దూరం పాటించేలా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.    


అన్నప్రసాద వితరణ పరిశీలన :

శ్రీశైలం దేవస్థానంలోని అన్నప్రసాద విభాగాన్ని ఈవో కేఎస్‌ రామరావు ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా అన్నదాన విభాగంలోని ఉద్యోగుల హాజరు నమోదు తనిఖీ చేశారు. తర్వాత అన్నదాన విభాగంలోని స్టోరు, వంటశాల, అన్నదాన విరాళాల సేకరణ కేంద్రంలో రికార్డు పుస్తకాలు, మినరల్‌ వాటర్‌ పొట్లాల తయారీ తదితర విభాగాలను పరిశీలించారు. 


భక్తులకు పులిహోర, పెరుగన్నం:

శ్రీశైల దేవస్థానంలో భక్తులకు పులిహోర, పెరుగన్నం ప్రసాదాలను భక్తులు కొనుక్కోడానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో నిలిచిపోయిన విక్రయాలు ఆది వారం తిరిగి ప్రారంభమయ్యాయి.   

Updated Date - 2020-07-13T11:46:40+05:30 IST