నిరాడంబరంగా రామయ్య పెళ్లి

ABN , First Publish Date - 2020-04-03T11:13:16+05:30 IST

రామతీర్థం రామస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం నిరాడంబరంగా నిర్వహించారు.

నిరాడంబరంగా  రామయ్య పెళ్లి

ఆలయ వర్గాలకే పరిమితమైన శ్రీరామనవమి వేడుకలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో భక్తులు దూరం

బోసిపోయిన రామతీర్థం దేవస్థానం


నెల్లిమర్ల, ఏప్రిల్‌ 2: రామతీర్థం రామస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా భక్తులకు అనుమతించలేదు. అర్చకులు, కొద్దిమంది దేవదాయ శాఖ సిబ్బంది హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వేడుకలు మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిశాయి. ఆలయ ఆస్థాన మండపంలో క్రతువు పూర్తి చేశారు. ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ఉంచి పూజలు చేశారు. ముందుగా ఆరాధన, బాలభోగం, తీర్థగోష్టి నిర్వహించారు. పంచామృతాలతో అష్టకలశ స్నపన మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ తల్లి శిరసుపై శ్రీరామచంద్రుడు జీలకర్ర, బెల్లం పెట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం మధ్యాహ్నం 1 గంటకు తలంబ్రాల తంతుతో ముగిసింది.


ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలను సింహాచలం దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావు తీసుకురాగా.. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పద్మావతి దంపతులు వాటిని ప్రధాన అర్చకులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు ఆలయం నుంచి వెనుదిరిగారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి పట్టు వస్ర్తాలను తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు. స్వామివారిని దర్శించుకొని వెనుదిరిగారు. ఆలయ ప్రఽధాన అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, అర్చకులు కిరణ్‌, గొడవర్తి నరసింహాచార్యులు, పవన్‌కుమార్‌, ప్రసాద్‌ల ఆధ్వర్యంలో వేడుకలను శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. దేవస్థానం ఈవో  బీహెచ్‌వీఎస్‌ఎన్‌ కిశోర్‌కుమార్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో భక్తులు వెళ్లకుండా విజయనగరం రూరల్‌ సీఐ డి.రమేష్‌ పర్యవేక్షణలో నెల్లిమర్ల ఎస్‌ఐ వి.అశోక్‌కుమార్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు లేకపోవడంతో ఆలయ ప్రాంగణం బోసిపోయింది. సతివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బి.సాయినందిని ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. 

Updated Date - 2020-04-03T11:13:16+05:30 IST