సంగీత కళానిధి శ్రీపాద

ABN , First Publish Date - 2020-08-03T10:21:03+05:30 IST

కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని సమున్నత స్థాయికి తీసుకువెళ్లిన వారిలో జిల్లాకు చెందిన శ్రీపాద పినాకపాణి ముందు ..

సంగీత కళానిధి శ్రీపాద

నేడు పినాకపాణి జయంతి


కర్నూలు (కల్చరల్‌), ఆగస్టు 2: కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని సమున్నత స్థాయికి తీసుకువెళ్లిన వారిలో జిల్లాకు చెందిన శ్రీపాద పినాకపాణి ముందు వరుసలో ఉంటారు.  సోమవారం ఆయన జయంతి. అప్పటి వరకు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అంత సులువు కాదని నిరాశపడిన వారికి ఆయన నొటేషన్స్‌ చాలా ఉపయోపడతాయి. ఆ రకంగా ఆయన సంగీతాభివృద్ధికి చేసిన కృషికి మెచ్చి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రదానం చేసింది. శాస్త్రీయ సంగీత ప్రపంచంలో కర్నూలు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఘనత శ్రీపాదకే దక్కుతుంది.


కర్నూలుకు చెందిన ఆయన కర్ణాటక సంగీతం ఉనికిని అన్ని వర్గాలకు చేరువ చేశారు. 1960వ దశకంలో ఆయన పుట్టిన ఊరు విజయనగరం నుంచి  కర్నూలు చేరుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌గా, ఆ తర్వాత వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ ఇక్కడే పదవీ విరమణ చేసి, కర్నూలులోని స్థిరపడిపోయారు. శాస్త్రీయ సంగీతంలో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్న ఏకైక వ్యక్తిగా రాయలసీమలో ఆయన నిలిచిపోతారు. ఆయన నేడు భౌతికంగా లేకపోయినా ఆయన స్వరలిపులు ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి సంకీర్తనల్లో మారుమోగుతూనే ఉన్నాయి.  


రాగనిధి శ్రీపాద

కర్ణాటక సంగీతంలో అప్పటి వరకు ఏ రాగాన్ని ఎలా ఆలపించాలో స్వర లిపులు ఉండేవి కాదు. సంగీత గురువులు తాము అభ్యసించిన గురువులు చెప్పే మార్గంలోనే రాగాలను పలికించేవారు. అయితే డాక్టర్‌ శ్రీపాద ఎన్నో ఏళ్లు శ్రమించి రాగాలకు స్వరలిపులు సమకూర్చారు. ఏ రాగం ఎలా ఆలపించాలో తేటతెల్లం చేశారు. ఆయన పుస్తకాలే నేడు సంగీత అభ్యాసనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. శ్రీపాద కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. ఆయన విశాఖలో ఎంబీబీఎస్‌ చదివి, 1943లో అసిస్టెంట్‌ సర్జన్‌గా ఉద్యోగంలో చేరారు. 1945లో ఎండీ పూర్తిచేసిన ఆయన కర్నూలు సర్వజన వైద్యశాలకు బదిలీపై వచ్చారు.  ఆయన సుమారు 800 కృతులకు స్వర లిపిలు సిద్ధం చేశారు. ఇందుకోసం ఆయన 12 సంవత్సరాలు కష్టపడ్డారు. 


సంగీతజ్ఞులుగా శిష్య ప్రశిష్యులు

సంగీతాన్నే తన జీవిత సర్వస్వంగా శ్రీపాద పినాకపాణి జీవించారు. ఆయన చూపిన స్వరబాణీలను అనుసరిస్తూ ఆయన వద్ద ఎందరో శిష్యరికం చేశారు. కొందరు ఏకలవ్య శిష్యులుగానూ ఎదిగారు. అలా సంగీత సరస్వతి నేదునూరి కృష్ణమూర్తి, నూకల చిన సత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, వోలేటి వెంకటేశ్వరరావు, నేతి శ్రీరామశర్మ, మల్లాది సూరిబాబు, మల్లాది బ్రదర్స్‌ వంటి వారంతా శిష్యులుగా, ప్రశిష్యులుగా ఆయన పేరు నిలబెట్టారు.  అలాగే మనోధర్మ సంగీతం, పల్లవి గాన సుధ, మేళరాగ మాలిక అనే సంగీత పుస్తకాలు రాశారు.  


బిరుదులు, సత్కారాలు

ఆంధ్రప్రదేశ్‌ సంగీత, నాటక అకాడమీ 1966లో ఆయనకు పురస్కారం అందజేసింది.  మద్రాసు సంగీత అకాడమి సంగీత కళానిధి,  1970లో మద్రాసు ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ సంగీత కళా శిఖామణి బిరుదులు ఇచ్చాయి.  1973లో విశాఖలో గాన కళా సాగర బిరుదును, 1973లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను, 1978లో ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదును ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ బిరుదు ఇచ్చి ఆయనలోని సంగీత ప్రజ్ఞకు పట్టం కట్టింది. 2012 ఆగస్టు 3న ఆయన 101వ జన్మదిన సందర్భంగా శత వసంతాలు పూర్తి చేసుకున్న సంగీత కళానిధిని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీగాన విద్యా వారధి బిరుదుతో ఘనంగా సత్కరించాయి. 2013 మార్చి 11న వయో భారంతో కన్నుమూశారు. 

Updated Date - 2020-08-03T10:21:03+05:30 IST