Abn logo
Sep 27 2020 @ 15:42PM

అన్నదాత కోసం.. అమెరికాలో మారథాన్‌..

Kaakateeya

అమెరికా వెళ్లగానే అన్నం పెట్టిన ఊరినే కాదు, తల్లిదండ్రుల్నీ మరిచిపోయేవాళ్లున్న కాలం ఇది. ఇతను మాత్రం ఆ డాలర్ల పరుగులో పడి, పల్లెటూళ్లను మరిచిపోలేదు. అప్పుడప్పుడూ పరుగుపోటీలో (మారథాన్‌) పాల్గొని.. పేద రైతులకు అండగా నిలుస్తున్నాడు... నల్లగొండ జిల్లాలోని మామిళ్లగూడెం వాసి శ్రీనివాస్‌ రణబోతు. అమెరికాలోని న్యూజెర్సీలో పనిచేస్తూ.. తెలుగురాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాడు..


అమెరికాలోని ఫిలడెల్ఫియా.. 42 కిలోమీటర్ల మారథాన్‌.. విజిల్‌ వేశారు. పరుగు మొదలైంది. అమెరికా మారథాన్ల నడుమ ఒక తెలంగాణ కుర్రాడు మెరుపు వేగంతో దూసుకెళ్లాడు. శక్తినంతా కూడదీసుకుని, ఐదుగంటలపాటు ఏకబిగిన పరిగెడుతూనే ఉన్నాడు. ఆయాసం అతన్ని ఆపడం లేదు, నీరసం అతన్ని నిలువరించడం లేదు. ఆ పరుగు పేరు కోసం కాదు.. ఫ్రైజ్‌మనీ కోసం అంతకంటే కాదు. ఆ మారథాన్‌ తెలుగురాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కోసం!. ‘డియర్‌ ఫ్రెండ్స్‌.. చనిపోయిన అన్నదాతల భార్యాపిల్లల్ని ఆదుకునేందుకు అండగా నిలవాలనుకున్నాను. అందుకే ఈ మారథాన్‌ చేస్తున్నాను. మీరిచ్చే ప్రతి డాలరూ.. వారికి జీవనాధారం అవుతుంది..’ అని ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ను కోరాడు శ్రీనివాస్‌ రణబోతు. అలా మారథాన్‌ చేసి.. సుమారు ఎనిమిదిన్నర లక్షల రూపాయల్ని పోగుచేశాడు. ఆ డబ్బుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రైతు కుటుంబాలకు సాయం చేశాడు. 


ఉచిత రేషన్‌తో మొదలై..

శ్రీనివాస్‌ సొంతూరు.. తెలంగాణలోని నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని మామిళ్లగూడెం (కొత్తగూడెం). తండ్రి ఉపాధ్యాయుడు. హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తిచేసి 2001లో అమెరికా వెళ్లాడు. సరిగ్గా అదే ఏడాది ఊరిలో ఎన్నడూలేని కరువొచ్చింది. ఒక రోజు ఫోన్‌లో ‘‘ఒరే.. ఈ ఏడాది కరువొచ్చింది. వానల్లేవు, పంటల్లేవు. పశువులకు మేత లేదు. ఊళ్లోని చాలామంది రేషన్‌ బియ్యాన్ని కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. బతుకులు ఘోరంగా ఉన్నాయి..’’ అన్నాడు తండ్రి. అమెరికాలో తన చుట్టూ ఉండే తెలుగుమిత్రులతో తమ ఊరి ఆవేదన చెప్పాడు శ్రీనివాస్‌. అప్పటికప్పుడే తలా కొన్ని డాలర్లు ఇచ్చారు. ఆ మొత్తంతో ఊళ్లోని పేదలందరికీ ఉచిత రేషన్‌ సరఫరా చేయించాడు. అక్కడి నుంచి సేవాదృక్పథం వైపు అడుగులు వేశాడీ యువకుడు. ‘‘ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ పత్రికల్లో రాసే కరువు కథనాలు చదివేవాణ్ణి. ఆయనతో కలిసి కొన్ని గ్రామాల్లో కూడా తిరిగాను. ఆ తరువాత లోక్‌సత్తా, కొండల్‌ ఆధ్వర్యంలోని రైతుస్వరాజ్య వేదికల ద్వారా వ్యవసాయ సంక్షోభాన్ని అర్థం చేసుకున్నాను. ‘సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌’ సంస్థ నిర్వాహకులు డా.రామాంజనేయులు చేస్తున్న కృషిని పరిశీలించాను. అమెరికా నుంచి ఎప్పుడు ఇండియా వచ్చినా.. ఇలాంటి సంస్థల ప్రతినిధులతో కలిసి పల్లెల్లో పర్యటించేవాణ్ణి..’’ అన్నాడు శ్రీనివాస్‌.


అమెరికా నుంచే..

ఇప్పటికే ప్రవాసాంధ్రులు ఎన్నో రకాల సామాజిక సేవలు చేస్తున్నారు. తను మాత్రం ప్రత్యేకించి నిరుపేద రైతుల కోసం ఓ సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నాడు. అమెరికాలో ఉన్నప్పుడే 2013లో ‘ఐ4ఫార్మర్స్‌’ను నెలకొల్పాడు. శ్రీనివాస్‌తోపాటు అతని ప్రతినిధి బృందం ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, వరంగల్‌ తదితర ప్రాంతాలు తిరిగి.. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల స్థితిగతుల మీద డాక్యుమెంటరీలు రూపొందించింది. ఒక ఇంట్లో రైతు చనిపోగానే- వారి పిల్లలకు చిన్న చిన్న పుస్తకాలు, పెన్నులు, నోటు బుక్కులు కొనివ్వలేక బడి మాన్పించేస్తున్నారు పేదలు. అలాంటి పిల్లలకు సహాయం చేసి, తిరిగి బడికి పంపించిందీ సంస్థ. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆసరాగా నిలబడింది. చనిపోయిన రైతుల భార్యలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించింది. ‘‘నేను అమెరికాలో మారథాన్‌ చేసినప్పుడు దాతలైన స్నేహితులు రూ.8.5 లక్షలు అందించారు. ఆ మొత్తాన్ని - ముప్పయివేల చొప్పున ముప్పయి కుటుంబాలకు సహాయం చేశాం. కుట్టు మిషన్లు, గేదెలు, కిరాణాషాపులకు ఆ డబ్బు పనికొచ్చింది..’’ అన్నాడు శ్రీనివాస్‌. కడప జిల్లాలోని అడవి చెర్లోపల్లిలోని నిరుపేద రైతులకు బోర్లు వేయించి, డ్రిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యం కల్పించాడు. సిద్దిపేటలోని నేలమ్మ మహిళా సహ కార సంస్థకు కొంత మూలధనం చెల్లించి.. వడ్డీలేనిరుణాలు అందించాడు. ఇలా సహాయం పొందిన వాళ్లందరూ సేంద్రీయసేద్యం సాగు చేయాలన్నది నిబంధన. అమెరికాకు వెళ్లినా అన్నం పెట్టే అన్నదాత కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్న శ్రీనివాస్‌ అభినందనీయుడు. వరంగల్‌ జిల్లా వర్దన్నపేట మండలంలోని ఒక పల్లెటూరికి వెళ్లాను. అక్కడ కిష్టయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు రెండెకరాల పొలం ఉంది. ఇంట్లో రెండు గిన్నెలు, రెండు జతల పాత బట్టలు తప్ప ఇంకేమీ లేవు. భర్త దినాలకు భోజనం పెట్టడానికి కూడా బియ్యం లేవు. అంత పేదరికం. కొత్తబట్టలు కొనివ్వలేక.. బతుకమ్మ వేడుక వద్దకు కూడా పిల్లల్ని పంపేది  కాదామె. ఒకసారి ఆమెకు చెయ్యి విరిగింది. ఆస్పత్రికి వెళ్లి కట్టుకట్టించుకుంటే.. కూలి పనులకు రానివ్వరని.. అలాగే వదిలేసింది. దాంతో చెయ్యి వంకరపోయింది. ఆ బాధలన్నీ విన్నాక.. నా మనసు వికలం అయ్యింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయో లేదో నాకు తెలీదు కానీ.. ఇప్పటికీ చనిపోతున్నారు. వినే మనసు ఉండాలే కానీ ప్రతి కుటుంబానిదీ ఒక కన్నీటి కథనే. ఇలాంటి పేదలకు మేము ఎంతో కొంత అండగా ఉండాలనుకున్నాం.

 - శ్రీనివాస్‌ రణబోతు, ఐ4ఫార్మర్స్‌, న్యూజెర్సీ, అమెరికా


Advertisement
Advertisement
Advertisement