శ్రీనివాస్‌.. పరిస్థితి ఎలా ఉంది..?

ABN , First Publish Date - 2022-09-30T04:42:04+05:30 IST

జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును ఆరాతీశారు.

శ్రీనివాస్‌.. పరిస్థితి ఎలా ఉంది..?
చంద్రబాబుతో చర్చిస్తున్న మాజీ మంత్రి కాలవ

- నియోజకవర్గాల్లో ఎలా పని చేస్తున్నారు? 

- జిల్లా రాజకీయాలపై బాబు ఆరా

- టీడీపీ అధినేతతో జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు సమావేశం

 అనంతపురం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును ఆరాతీశారు. నియోజకవర్గ ఇనచార్జ్‌లతో ముఖాముఖిలో భాగంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాయదుర్గం నియోజకవర్గ ఇనచార్జ్‌ కాలవ శ్రీనివాసులుతో గురువారం చంద్రబాబు మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలు, అధికార పార్టీ స్థానిక నేతల అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలపై ఎప్పటికప్పుడు నిర్వహించే నిరసన కార్యక్రమాలను అధినేత దృష్టికి కాలవ శ్రీనివాసులు తీసుకెళ్లారు. ఇదే సందర్భంలో జిల్లాలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల్లో ఇనచార్జ్‌ల పనితీరు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ‘నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం చేపడుతున్నారా...? అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను ఎండగడుతున్నారా..? భూకబ్జాలు, ఇతరత్రా అరాచకాలపై ఎప్పటికప్పుడు నిలదీసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారా..? లేదా..?’ ఇలా అనేక అంశాల గురించి చంద్రబాబు ఆరాతీసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో నాయకుల మధ్య వర్గపోరు గురించి చంద్రబాబు.. కాలవను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీకి నష్టం వాటిల్లే విధంగా ఎవరు వ్యవహరించినా, ఎక్కడికక్కడ సరిదిద్దేందుకు చొరవ చూపాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చొరవ చూపాలని కాలవతో అన్నట్లు సమాచారం. పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపేవిధంగా, సమష్టి నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలను విరివిగా చేపట్టాలని సూచించినట్లు తెలిసింది.


Updated Date - 2022-09-30T04:42:04+05:30 IST