లంక దాడులకు నిరసనగా సమ్మెకు దిగిన జాలర్లు

ABN , First Publish Date - 2022-02-03T13:26:51+05:30 IST

పొట్టకూటి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్తున్న తమపై శ్రీలంక నావికాదళం దాడులు చేయడాన్ని నిరశిస్తూ జాలర్లు సమ్మెకు దిగారు. నాగపట్టణం, కడలూరు తదితర జిల్లాల్లో

లంక దాడులకు నిరసనగా సమ్మెకు దిగిన జాలర్లు

               - ఆగిన పడవలు 

               - బోసిపోయిన తీరం


అడయార్‌(చెన్నై): పొట్టకూటి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్తున్న తమపై శ్రీలంక నావికాదళం దాడులు చేయడాన్ని నిరశిస్తూ జాలర్లు సమ్మెకు దిగారు. నాగపట్టణం, కడలూరు తదితర జిల్లాల్లో లక్షలాది మంది జాలర్లు బుధవారం చేపట వేటకు వెళ్లకుండా వదిలేశారు. దీంతో తీర ప్రాంతాలు బోసిపోయాయి. సముద్ర తీరంలో పడవలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. నిత్యం జాలర్ల హడావుడితో సందడిగా వుండే తీరాలు వెలవెలబోయి కనిపించాయి. ఇటీవలి కాలంలో శ్రీలంక నావికాదళం రాష్ట్ర జాలర్లపై వరుసగా దాడులకు తెగబడుతోంది. దీనికి తోడు సముద్రపు దొంగల బెడద కూడా పెరిగింది. రాష్ట్ర జాలర్లను నష్టపరచడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఇవన్నీ జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని జాలర్ల కుటుంబాలు వాపోతున్నాయి. అందుకే కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, శ్రీలంక ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ జాలర్లు సమ్మెకు దిగారు. తమపై దాడులకు ఆపడంతో పాటు శ్రీలంక చెరలో వున్న రాష్ట్ర జాలర్లను వెంటనే విడిపించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు కేంద్రం శ్రీలంకపై ఒత్తిడి తీసుకురావాలని వారు నినాదాలు చేపట్టారు. మరికొందరు తమ పడవలపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. జాలర్ల సమ్మెతో సుమారు 5 వేల చేపల పడవలు, 10 వేల మరపడవలు తీరానికే పరిమితమయ్యాయి. పలు చోట్ల జాలరులు తీరం వెంట కేంద్ర ప్రభుత్వానికి, శ్రీలంక ప్రభుత్వానికి వ్యతి రేకంగా నిరశిస్తూ ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాలర్లు విలేఖరులతో మాట్లాడుతూ... రాష్ట్రానికి చెందిన జాలర్లపై దురుద్దేశ పూరితంగా లంక నావికాదళం దాడులు చేస్తోందని వాపోయారు. ఈ దాడుల నుంచి తమను కాపాడాలని ఎన్నో ఏళ్లుగా తాము కోరుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. 


కాశిమేడు జాలర్లపై దాడి

కాశిమేడు జాలర్లపై  సముద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.. ఓ మరపడవలో వెళ్లిన హరికృష్ణన్‌ 65), అన్బు (68), జయపాల్‌ (63, ఆర్ముగం (62)చేపలు పడుతుండగా, ఓ పడవలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలు, రాళ్లతో దాడి చేశారు. అనంతరం వారి వద్ద వున్న జీపీఎస్‌ పరికరాలు, వాకీటాకీలను అపహరించుకుని వెళ్లారు. దీనిపై హరికృష్ణన్‌ బృందం కాశిమేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2022-02-03T13:26:51+05:30 IST