శ్రీలంకకు పంపే బియ్యం కొనుగోళ్లపై స్టే ఇవ్వండి

ABN , First Publish Date - 2022-05-13T14:17:49+05:30 IST

శ్రీలంకకు తరలించే బియ్యం కొనుగోళ్లపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రజలను

శ్రీలంకకు పంపే బియ్యం కొనుగోళ్లపై స్టే ఇవ్వండి

                       - పిటిషన్‌ తోసిపుచ్చిన హైకోర్టు


పెరంబూర్‌(చెన్నై): శ్రీలంకకు తరలించే బియ్యం కొనుగోళ్లపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రజలను ఆదుకొనేందుకు బియ్యం పంపనున్నట్లు సీఎం స్టాలిన్‌ ఇటీవల శాసనసభలో ప్రకటించారు. అందుకు 40 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కిలో రూ.33.50 లెక్కన కొనుగోలు చేసేం దుకు ప్రభుత్వం రూ.134 కోట్లు కేటాయించింది. ఈ వ్యవహారంపై తిరువారూర్‌ జిల్లా తిరుకన్నమంగై గ్రామానికి చెందిన జయశంకర్‌ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో... శ్రీలంకకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన 40 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కిలో రూ.33.50కి కొనుగోలు చేస్తున్నామన్నారని, ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐ దగ్గర కిలో రూ.20కే కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి రూ.54 కోట్లు ఆదా అవుతుందన్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం కొనుగోలుపై పలువురు నిపుణులు అభ్యంతరం తెలుపగా, అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపడతామని రాష్ట్రప్రభుత్వం హెచ్చరిస్తోందని, ఈ కొనుగోళ్లకు సంబంధించిన జీవోకు స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ గురువారం న్యాయమూర్తులు స్వామినాధన్‌, సెంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన బెంచ్‌ విచారించగా కేంద్రప్రభుత్వం ద్వారా శ్రీలంకకు బియ్యం పంపుతున్నామని, అత్యవసరంగా బియ్యం కొనుగోలు చేయాల్సి రావడంతో టెండర్లు ఆహ్వానించలేదని రాష్ట్రప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది వాదనలు వివరించారు. రాష్ట్రప్రభుత్వ వాదన పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు, ఈ కేసులో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ, వేసవి సెలవుల తర్వాత  విచారిస్తామన్నారు. 


బియ్యం తరలింపునకు ప్రత్యేక కమిటీ

శ్రీలంకకు 40 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం, 500 మెట్రిక్‌ టన్నుల పాల పొడి తరలింపు పర్యవేక్షణకు నలుగురు ఐఏఎస్ తో కూడిన ప్రత్యేక కమిటీని రాష్ట్రప్రభుత్వం నియమించింది. శ్రీలంకకు తరలిస్తున్న బియ్యం ఆ దేశంలోని తమిళులకే చెందేలా ముఖ్యమంత్రి స్టాలిన్‌ చర్యలు చేపట్టారు. ఈ ఏర్పాట్లు చేపట్టేందుకు ఏర్పాటుచేసిన కమిటీలో ప్రవాస తమిళుల సంక్షేమ శాఖ కార్యదర్శి జేసిందా లారెన్స్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ప్రభాకర్‌, ఆవిన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుబ్బయన్‌, మందుల కొనుగోలు విభాగం కమిషనర్‌ ఉన్నారు.. ఈ నెలాఖరులోగా చెన్నై, తూత్తుకుడి హార్బర్ల నుంచి ప్రత్యేక నౌకల ద్వారా సరకులు తరలిస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది.

Read more