లంకతో జాగ్రత్త!

ABN , First Publish Date - 2022-05-12T14:32:08+05:30 IST

పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభంతో అక్కడి బాధితులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దు ప్రాంతం కావడం, అతి

లంకతో జాగ్రత్త!

- సంక్షోభం వల్ల చొరబాటుకు అవకాశం 

- కేంద్ర నిఘా సంస్థల హెచ్చరిక

- భద్రతా దళాలు అప్రమత్తం

- తీరం వెంబడి నిఘా పెంపు


చెన్నై: పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభంతో అక్కడి బాధితులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దు ప్రాంతం కావడం, అతి సమీపంలో ఉండడంతో వారి తొలి అడుగు తమిళనాడులోకే అవుతుందని అప్రమత్తం చేశాయి. దీనికి తోడు శ్రీలంకలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యం లో 58 మంది ఖైదీలు వివిధ జైళ్ళ నుంచి తప్పించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు సంఘ విద్రోహశక్తులు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, నిషేధిత ఎల్టీటీఈకి చెందిన తీవ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర తీర ప్రాంతాల్లో భద్రతాదళాలు మరింత అప్రమత్తమయ్యాయి. అడుగడుగునా డేగ కన్నుతో పహారా కాస్తున్నాయి. ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తరుణంలో ఆ దేశానికి చెందిన అనేకమంది రాజకీయ నేత లు, ముఖ్యులు తమిళనాడుకు వలస వెళ్తున్నారంటూ మీడియాలో విస్త్రతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర నిఘా వర్గాలు సైతం అనుమానం వ్యక్తం చేయడంతో తీరం వెంబడి గస్తీ తీవ్రతరం చేశారు. చెన్నై నుంచి కన్నియాకుమారి వరకు ఉన్న కోస్తా తీరం వెంబడి గస్తీ మరింత కట్టుదిట్టం చేశారు. భారత నౌకాదళంతో పాటు కోస్తా తీర దళం డేగ కన్నుతో పహారా కాస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట శ్రీలంక నుంచి భారత సముద్ర జలాల్లోకి వచ్చే ప్రతి పడవను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా భారత నౌకా దళానికి చెందిన అత్యాధునిక గస్తీ నౌకలను సైతం పహారా కోసం వియోగిస్తున్నారు. శ్రీలంకకు సమీపంలో ఉండే రామేశ్వరం ప్రాంతంలో ఈ గస్తీ మరింత కట్టుదిట్టం చేశారు. రామేశ్వరం తీరానికి వచ్చే ప్రతి నౌకను, అందులోని వారి వివరాలను పూర్తిగా సేకరిస్తున్నారు. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లే రాష్ట్ర జాలర్లపైనా పలు కఠిన ఆంక్షలు విధించారు. 


రాజపక్సేకు ఆశ్రయం ఇవ్వొద్దు   

అన్బుమణి

శ్రీలంకలో ప్రజా తిరుగుబాటులో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఆ దేశ ప్రదాని మహీందా రాజపక్సేకు భారత ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వబోతున్నట్టు వస్తున్న వార్తలపై పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ధర్మపురి లోక్‌సభ సభ్యుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ స్పందించారు. ప్రజాద్రోహి రాజపక్సేకు భారత ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన ప్రజా తిరుగుబాటుతో ఆ దేశ ప్రధాని మహీందా రాజపక్సేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్టు వార్తలు వస్తున్నాయని, ఎల్టీటీఈపై సాగించిన యుద్ధకాండలో దాదాపు లక్షన్నర మంది అమాయక తమిళ ప్రజలను కిరాతంగా చంపినవారు రాజపక్సే సోదరులేనని పేర్కొన్నారు. వారిని యుద్ధ నేరస్తులుగా నిరూపించే ఆధారాలను ఐక్యరాజ్య సమితి సేకరించిందని, అలాంటి యుద్ధ నేరస్తులకు భారత ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆశ్రయం కల్పించరాదని అన్బుమణి రాందాస్‌ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read more