బలగర్వం ఎప్పటికైనా ప్రమాదకరమే

ABN , First Publish Date - 2020-08-16T08:48:52+05:30 IST

పరమేశ్వరునితో శ్రీకృష్ణుడు పలికిన మాటలివి. వ్యాస భగవానుడు తన భాగవత మహా పురాణమందు ప్రవచించిన ఐతిహాసాలలో...

బలగర్వం ఎప్పటికైనా ప్రమాదకరమే

దర్పోపశమనాయాస్య ప్రవృక్ణా బాహవో మయా శ్రీ

సూదితంచ బలం భూరి యచ్ఛ భారాయితం భువఃశ్రీశ్రీ

పరమేశ్వరునితో శ్రీకృష్ణుడు పలికిన మాటలివి. వ్యాస భగవానుడు తన భాగవత మహా పురాణమందు ప్రవచించిన ఐతిహాసాలలో బాణాసుర వృత్తాంతం ఒకటి. తన కఠోర తపస్సు చేత పరమశివుణ్ణే మెప్పించి.. ఆ దేవదేవుడిని తన వాకిట నిలుపుకొన్నాడు రాక్షస రాజు బాణుడు. బలిచక్రవర్తి కుమారుడైన బాణుడు తనకున్న వేయి బాహువుల బలాన్ని చూచుకొని మిక్కిలి గర్వితుడై అనేక అకృత్యాలకు పాల్పడ్డాడు. తన కుమార్తెకు కాబోయే భర్త అనిరుద్ధుని బంధించి.. శ్రీకృష్ణునితో విరోధాన్ని కొనితెచ్చుకున్నాడు. తన బాహు బలం, తనకున్న ఈశ్వర రక్షణ తననేమీ చేయలేదన్న అహంకారంతో చేసిన యుద్ధంలో.. ఆ శ్రీకృష్ణుని చేతిలో తనకున్న బాహువులన్నీ పోగొట్టుకుని, నాలుగింటినే మిగుల్చుకున్నాడు. అపారమైన తన రాక్షస సైన్యాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత అతడికి జ్ఞానోదయమైంది. ఆ సందర్భంలో పరమశివుడు శ్రీకృష్ణుని స్తుతించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శివునితో ‘‘ఓ పరమేశ్వరా! నేను ఇతని బాహువులను ఖండించడానికి కారణం అతని అహంకారం మాత్రమే. ఆ బాహువుల బలగర్వం కారణంగానే వాటిని ఖండించి, భూమికి భారంగా మారిన అతని సేనా సమూహాన్ని నాశనం చేశాను’’ అని చెప్పిన ఈ మాటలు మానవ జాతికి వ్యాస భగవానుడందించిన గొప్ప సందేశం. పరమేశ్వరుని ప్రార్థనకు స్పందించిన శ్రీకృష్ణుడు కూడా బాణాసురుడిని క్షమించి కేవలం చతుర్భుజునిగా వదలడమేగాక ఆ దేవదేవుడితో.. 

అవధ్యో యం మయా ప్యేష వైరో చనిసుతో సురఃశ్రీ

ప్రహ్లాదయా వరోదత్తో నవధ్యోమే త్వదన్వయశ్రీశ్రీ

అంటూ ‘‘బలిచక్రవర్తి కుమారుడైన ఈ బాణుడు నా చేతకూడా వధార్హుడు కాడు. ఎందుకనగా ఈ వంశములో నేను ఎవ్వరినీ వధించనని ఆనాడే నా పరమ భక్తుడైన ప్రహ్లాదునికి వరమునిచ్చాను’’ అని కేవలం భుజబలగర్వాన్ని అణచడానికే అతని వేయి చేతులలో నాలుగింటినే మిగిల్చి, మిగిలినవి ఖండించాను’’ అని చెప్పాడు. సాధారణంగా లోకలంలో మానవులు ధనం వల్ల, బలం వల్ల అత్యంత గర్వితులై అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. మనకు పురాణేతిహాసాల్లో కనిపించే దానవులు చాలా వరకు ఈ కోవలోనివారే. భాగవత పురాణంలో స్వామి అవతార పరమార్థం కూడా ఇటువంటి బలగర్వితులను సంహరించడమే. గర్వమనేది లోకకంటకమైన అంశం. లోకకంటకులంతా ఏదో ఒక రకమైన బలగర్వితులే. వరగర్వం, జాతిగర్వం, ధనగర్వం వంటి పలు విధాలైన గర్వాలను అణిచేందుకు సాక్షాత్తూ నారాయణుడే పూనుకొని.. భగవద్భక్తులను, లోకాన్ని రక్షించవలసి రావడం మనకు ఈ మహాగ్రంథంలో అడుగడుగునా కనిపిస్తుంది. మదాందులను ఏ దేవుడైనా రక్షించలేడనేది బాణాసురుడి ఉదంతం స్పష్టం చేస్తోంది. 

- గన్నమరాజు గిరిజామనోహరబాబు

Updated Date - 2020-08-16T08:48:52+05:30 IST