Abn logo
Feb 22 2020 @ 04:04AM

శివోహం

ఆలయాల్లో మార్మోగిన శివనామస్మరణ

లక్షలాది భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

శ్రీశైలంలో కన్నుల పండువగా ఆదిదంపతుల కల్యాణం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): భక్తిభావం వెల్లివిరిసింది. శివనామస్మరణ మర్మోగింది. శివాలయాన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు గురువారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది తరలివచ్చారు. వేకువజాము 2గంటల నుంచే దర్శనానికి అనుమతించారు. ఉత్సవాల్లో ప్రత్యేకమైన పాగాలంకరణ కోసం రాత్రి 10 గంటలు కాగానే విద్యుద్దీపాలు నిలిపివేశారు. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన ఫృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరంగా మారి గర్భాలయం పైకి చేరుకున్నారు. స్వామివారి శిఖరం (గోపురం)తో 14నందులను కలుపుతూ ఆయన పాగాచుట్టారు. అర్ధరాత్రి 12గంటలకు ఆదిదంపతుల కల్యాణోత్సవం నిర్వహించారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్నినాని, అవంతి శ్రీనివాస్‌ స్వామిని దర్శించుకున్నారు. శనివారం రథోత్సవం నిర్వహిస్తారు.


శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు

శ్రీకాళహస్తి భక్తకోటితో కిక్కిరిసింది. స్వయంభువుగా వెలసిన వాయులింగేశ్వరుడు నిత్యాభిషేకమూర్తిగా కొలువై వేకువజాము నుంచే దర్శనమిచ్చారు. ఉదయం గంగా సమేత శ్రీకాళహస్తీశ్వరుడు ఇంద్రవిమానంపై, జ్ఞానప్రసూనాంబ చప్పరంపై మాడవీధుల్లో ఊరేగారు. రాత్రి స్వామివారు నందివాహనం, జ్ఞానప్రసూనాంబ సింహవాహనంపై విహరించారు. సినీనటులు మోహన్‌బాబు, నితిన్‌ స్వామిని దర్శించుకున్నారు. 


కోటప్పకొండలో ప్రభల కాంతులు

గుంటూరు జిల్లా కోటప్పకొండలో లక్షలాదిగా భక్తులు కోటయ్య స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకాలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ప్రభ సమర్పించారు. తిరునాళ్లలో 14 భారీ విద్యుత్‌ ప్రభలు కొలువుతీరాయి. ఉపసభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వామిని దర్శించుకున్నారు.


 స్తంభించిన ట్రాఫిక్‌.. భక్తుల ఇక్కట్లు

 కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లే మార్గాల్లో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచే ట్రాఫిక్‌ స్తంభించి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారని భక్తులు  విమర్శలు చేశారు.  


సాగరతీరంలో మహా కుంభాభిషేకం

విశాఖ ఆర్కేబీచ్‌లో రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం జరిగింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి హాజరై పూజాదికాలు నిర్వహించారు. సినీనటులు శారద, మురళీమోహన్‌, కవిత, మీనా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుడ్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.మందసకు సమీపంలోనిమహేంద్రగిరి పంచపాండవుల ఆలయాలు(పంచాక్షరి)జనసంద్రమయ్యాయి.


గోదారి తీరం.. భక్తజన సంద్రం

రాజమహేంద్రవరం గోదావరితీరంలో సుమారు లక్ష మందికిపైగా భక్తులు స్నానాలు చేసి, కోటిలింగేశ్వరస్వామిని, ఉమామార్కండేఽశ్వర స్వామి, విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సామర్లకోట కుమారరామం, ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పిఠాపురం పాదగయలో సుమారు 4లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో పిఠాపురంలో 900 పెన్నులు, 600 పెన్సిళ్లు వినియోగించి ఏర్పాటు చేసిన పెన్నుల శివలింగం ఆకట్టుకుంది. 


దుర్గమ్మకు మంగళగిరి పట్టువస్త్రాలు

మహాశివరాత్రిని పురస్కరించుకుని బెజవాడ దుర్గమ్మకు శ్రీశివభక్త మార్కండేయ వంశీకులు మంగళగిరి చేనేత వస్త్రాలు బ హూకరించారు. దామర్ల వెంకటనరసింహం, గంజి చిరంజీవి, చిల్లపల్లి మోహనరావు పట్టువస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమ, విభూది, ఫలపుష్పాలను 14వెదురు పళ్లేల్లో కూర్చి, వాటికి పూజలు నిర్వహించి, ఈవోకు అందజేశారు. 


యాత్రికులపైకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరి మృతి

 16వ నంబరు హైవేపై యడ్లపాడు మండల పరిధిలో కోటప్పకొండ తిరునాళ్లకు వెళుతున్న యాత్రికుల ఎడ్ల బండ్లపైకి లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు మృతిచెందారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు వాసులు గురువారం రాత్రిప్రభను కట్టుకుని కోటప్పకొండకు వెళుతుండగా.. గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న పార్శిల్‌ లారీ ఎడ్లబండ్లపైకి దూసుకెళ్లింది. నిమ్మగడ్డ కోటేశ్వరరావు(65) అక్కడికక్కడే చనిపోగా, ముగ్గురు తీవ్రంగా, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన కొండూరి వీరయ్య(62)ను గుంటూరు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. 

Advertisement
Advertisement
Advertisement