Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మందకొడిగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి విస్తరణ పనులు

twitter-iconwatsapp-iconfb-icon
మందకొడిగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి విస్తరణ పనులు నిర్మాణంలో ఉన్న ప్రభుత్వాస్పత్రి భవనం

రోగులకు తప్పని తిప్పలు


శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి విస్తరణ పనులు నత్త నడకే నయం అన్నట్టుగా ముందుకు సాగుతున్నాయి. నిర్మాణ పనులు మందకొడిగా జరుగుతుండటంతో ఆస్పత్రిలో రోగులకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. మరో నాలుగు నెలల్లో నిర్దేశించిన కాలపరిమితి గడువు ముగియనున్నప్పటికీ పనుల్లో వేగం మాత్రం పుంజుకోవడంలేదు.

- శ్రీకాళహస్తి


శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టణంలోని అయ్యలనాడుచెరువులో వంద పడకల సామర్థ్యంతో నిర్మించింది. తూర్పుమండలాలతోపాటు అప్పటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగంగా ఉన్న వెంకటగిరి, బాలయపల్లి, నాయుడుపేట సూళ్లూరుపేట ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందేవారు. ఈ క్రమంలో ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో శస్త్రచికిత్సలు, కాన్పులు, ఆపరేషన్లు కూడా పెరిగాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆరేళ్ల క్రితం వంద పడకల సామర్థ్యానికి మించి 150 పడకల స్థాయిలో రోగుల సంఖ్య నమోదు కావడం ఆరంభమైంది. అప్పటి నుంచి ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని అధికారులు, పాలకులు పలుమార్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడేళ్ల క్రితం 150 పడకలకు విస్తరించడానికి నాడు-నేడు పథకం కింద ఎంపిక చేశారు. ఇందుకోసం నాబార్డు కింద రూ.12కోట్ల నిధులతో పనులను ఓ ప్రైవేటు సంస్థ ప్రారంభించింది. 2020 అక్టోబరు 26వ తేదీన పనులను కూడా ప్రారంభించింది. 4,049.53 చదరపు మీటర్లు నిర్మాణ పనులను చేపట్టింది. రెండేళ్లలోగా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. పనులు ప్రారంభించి ఇప్పటికే దాదాపు 20 నెలలు పూర్తయింది. అక్టోబరు నాటికి పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. దాంతో ఇటీవల మరో నెల రోజులు కాలపరిమితిని పెంచినట్లు స్టిక్కర్‌ అతికించారు. 


రోగులకు తీవ్ర అవస్థలు


నిర్మాణ పనులు మందకొడిగా సాగుతుండటంతో ఏరియా ఆస్పత్రిలో రోగులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి. ఓపీలో నాలుగు మరుగుదొడ్లు ఉండగా నెల రోజుల నుంచి కనీసం ఒక్కటి కూడా ఉపయోగానికి లేకుండా పోయింది. మరమ్మతుల పేరుతో ఓపీ విభాగంలో మరుగుదొడ్లను మూతవేశారు. ఇక ప్రధానంగా ఈ ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ చాలా అవసరం. మొదటి అంతస్తులో ఆపరేషన్‌ థియేటర్‌ ఉంది. మొత్తం నిర్మాణ పనులు రెండో అంతస్తులో జరుగుతున్నాయి. దీనివల్ల పలుమార్లు ఆపరేషన్‌ థియేటర్‌కు ఆటంకాలు ఎదురయ్యాయి. గత ఏడాది, అంతకు ముందు సంవత్సరం ముందస్తు ప్రణాళిక లేకుండా పనులు సాగడంతో లీకేజీల కారణంగా రెండుసార్లు ఆపరేషన్‌ థియేటర్‌ మూతపడింది. ప్రస్తుతం ఈనెల తొమ్మిదో తేదీ నుంచి లీకేజీల కారణంగా మళ్లీ ఆపరేషన్‌ థియేటర్‌ను మూతవేశారు. ఇక ఎన్ని రోజులకు తెరచుకుంటుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇక గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న అతిసార వడదెబ్బ (ఐడీహెచ్‌), సర్జికల్‌ వార్డులు చాలా రోజులుగా మూతపడ్డాయి. ప్రస్తుతం వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో అతిసార, వడదెబ్బ బాధితులు ఆస్పత్రికి అధికంగా వస్తున్నారు. సర్జికల్‌ వార్డు రోగులను మెడికల్‌వార్డులో సర్దుతున్నారు. అతిసార, వడదెబ్బ బాధితులను మెడికల్‌ వార్డు పక్కన వరండాలో తాత్కాలికంగా బెడ్లు వేసి చికిత్సలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకటో అంతస్తులోని కుటుంబ నియంత్రణ వార్డు కూడా మూతపడింది. ఇకనైనా ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నవంబరు 30వ తేదీకైనా ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తవుతాయా? అన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.  


మందకొడిగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి విస్తరణ పనులు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.