1.14 శాతం మంది తల్లులకు Amma Odi ఇవ్వలేకపోయాం: CM Jagan

ABN , First Publish Date - 2022-06-27T18:34:06+05:30 IST

విద్యారంగంలో మూడేళ్లలో సమూలమార్పులు చేశామని సీఎం జగన్ అన్నారు.

1.14 శాతం మంది తల్లులకు Amma Odi ఇవ్వలేకపోయాం: CM Jagan

శ్రీకాకుళం (Srikakulam): విద్యారంగంలో మూడేళ్లలో సమూలమార్పులు చేశామని, బడికి వెళ్తేనే పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కోడి రామూర్తి స్టేడియంలో అమ్మ ఒడి (Amma Odi) పథకం మూడో విడత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 75 శాతం హాజరు ఉండాలని ఆ జీవోలోనే పొందుపర్చామన్నారు. హాజరు శాతం తగ్గడంతోనే 51 వేల మందికి అమ్మఒడి ఇవ్వలేదని, మొత్తంగా 1.14 శాతం మంది తల్లులకు అమ్మఒడి పథకం ఇవ్వలేకపోయామని, ఈ విషయంలో తనకు బాధగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్‌లో ఇది పునరావృతం కాకుండా పిల్లల్ని బడికి పంపాలని తల్లులకు సూచించారు. 


అమ్మఒడి పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా.. పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమ్మఒడి లాంటి పథకం తెచ్చారా? అని అన్నారు. విద్యారంగం సంక్షేమానికి ఏనాడైనా ఒక్క రూపాయి ఇచ్చారా?.. విమర్శించే దుష్టచతుష్టయానికి నిజాలు చెప్పే ధైర్యం ఉందా అని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చామన్నారు. ఎగ్గొట్టే ప్రభుత్వమైతే 95 శాతం హామీలు అమలు చేస్తామా?.. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నామని, ప్రజల అండ ఉన్నంతవరకు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరని జగన్‌ వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజ్యుస్ యాప్తో ఒప్పందం చేసుకున్నామని, శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజ్యుస్ యాప్ ఇప్పుడు పేదలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. 4.7 లక్షల మంది 8వ తరగతి పిల్లలకు సెప్టెంబర్‌లో రూ. 12వేలు విలువజేసే ట్యాబ్ ఇవ్వబోతున్నామన్నామని సీఎం జగన్ చెప్పారు.

Updated Date - 2022-06-27T18:34:06+05:30 IST