మార్గం తప్పి.. పిల్లర్లను ఢీకొని..!

ABN , First Publish Date - 2022-05-21T05:54:51+05:30 IST

శ్రీకాకుళం నుంచి విజయవాడకు వాహనంలో బయల్దేరారు. మూడున్నర గంటలసేపు ప్రయాణించారు. అర్ధరాత్రి దాటాక అనకాపల్లి జిల్లా శంకరం వద్ద మార్గం తప్పారు. వీరి వాహనం కల్వర్టు పిల్లర్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో శ్రీకాకుళం డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యనారాయణ సతీష్‌(55) మృతి చెందారు. తహసీల్దార్‌తో పాటు మరో ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో సిక్కోలులో విషాదఛాయలు అలుముకున్నాయి.

మార్గం తప్పి.. పిల్లర్లను ఢీకొని..!
డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు...

అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌ మృతి
తహసీల్దార్‌, రెవెన్యూ సిబ్బందికి తీవ్రగాయాలు
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/అనకాపల్లి, మే 20:
శ్రీకాకుళం నుంచి విజయవాడకు వాహనంలో బయల్దేరారు. మూడున్నర గంటలసేపు ప్రయాణించారు. అర్ధరాత్రి దాటాక అనకాపల్లి జిల్లా శంకరం వద్ద మార్గం తప్పారు. వీరి వాహనం కల్వర్టు పిల్లర్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో శ్రీకాకుళం డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యనారాయణ సతీష్‌(55) మృతి చెందారు. తహసీల్దార్‌తో పాటు మరో ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో సిక్కోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి కారులో గురువారం రాత్రి 10 గంటల సమయంలో తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావు, డిప్యూటీ తహసీల్దార్‌ ఎస్‌.సతీష్‌, జిల్లా పౌరసరఫరాల కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఇచ్ఛాపురం డిప్యూటీ తహసీల్దార్‌ బలివాడ శ్రీహరి విజయవాడ బయలుదేరారు. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద జీవీఎంసీలో సర్వేయర్‌గా పనిచేస్తున్న ఉరిటి సూర్యభగవాన్‌ ఏర్పాటు చేసిన ఇన్నోవా కారు ఎక్కారు. విజయవాడలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును కలిసేందుకు వారంతా వెళ్తున్నట్లు సమాచారం. కాగా వీరు ప్రయాణిస్తున్న వాహనం పెందుర్తి మీదుగా అర్ధరాత్రి 1.30 గంటలకు అనకాపల్లి జిల్లా శంకరం వద్దకు చేరుకుంది. అక్కడ  జాతీయ రహదారి నుంచి సింగిల్‌ రోడ్డులోకి వెళ్లాల్సిన వాహనం మరో మార్గంలో దూసుకువెళ్లి నిర్మాణంలో ఉన్న కల్వర్టు పిల్లర్లను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌ తలకు తీవ్రగాయమైంది. స్థానికులు, జాతీయ రహదారి భద్రతా సిబ్బంది విశాఖపట్నంలోని ఆరిలోవలో గల అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అలాగే తీవ్రంగా గాయపడిన శ్రీకాకుళం రూరల్‌ తహసీల్దార్‌ వెంకటరావుతో పాటు ఇద్దరు డీటీలు శ్రీకాంత్‌, శ్రీహరి, సర్వేయర్‌ సూర్యభగవాన్‌, డ్రైవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సునీల్‌, ట్రాఫిక్‌ సీఐ ప్రసాదరావు పరిశీలించి ప్రమాదంపై ఆరా తీశారు. రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌ నరసింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతీష్‌ మృతితో కుటుంబ సభ్యులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. శుక్రవారం రాత్రి ఆయన భౌతికదేహాన్ని శ్రీకాకుళం తీసుకురాగా.. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం వద్ద రెవెన్యూ సిబ్బంది, స్థానికులు నివాళి అర్పించారు. సతీష్‌ మృతిపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సంతాపం తెలిపారు.

 అందరి వద్ద మనన్నలు
డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌ స్వగ్రామం గార మండలం గొంటి గ్రామం. ప్రస్తుతం శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్య శ్రీవల్లి, కుమారుడు వినయ్‌, కుమార్తె నవ్య ఉన్నారు. రెవెన్యూలో తోటమాలిగా చేరి.. జూనియర్‌ అసిస్టెంట్‌, డీఆర్వో వద్ద సీసీగా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా, సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌గా  పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఎన్నికల విధులు, అటు ప్రొటోకాల్‌ విధులను కూడా నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో ఇటు ఉద్యోగులు.. అటు ప్రజాప్రతినిధుల మన్ననలు పొందుతూ మంచిపేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా గత ఏడాది కరోనా రెండో దశలో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌తో కలసి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే ఉండి విధులు నిర్వహించారు. కొవిడ్‌ రోగులు కొంతమంది మరణించగా.. రోటరీ ఆధ్వర్యంలో సతీష్‌ ముందుండి వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘బెస్ట్‌ కొవిడ్‌ వారియర్‌’ పేరిట అవార్డును అందజేసి.. సత్కరించింది. 

Updated Date - 2022-05-21T05:54:51+05:30 IST