ఉన్నత సంప్రదాయాలకు నెలవు సిక్కోలు

ABN , First Publish Date - 2021-01-27T05:53:29+05:30 IST

లో జాతీయ జెండాను కలెక్టర్‌ నివాస్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్‌ డాగ్‌ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం సమావేశంలో కలెక్టర్‌ కీలక ప్రసంగం చేశారు. ఆయన మాటల్లోనే... ‘జి

ఉన్నత సంప్రదాయాలకు నెలవు సిక్కోలు
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ నివాస్‌


సుదీర్ఘ సాహితీ, సాంస్కృతిక వారసత్వ సంపద
కుల, మత సామరస్యానికి ప్రతీక
కొవిడ్‌ పరీక్షల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం
అందరి సహకారంతోనే ఇది సాధ్యం
కొవిడ్‌ వారియర్స్‌ సేవలు మరువలేనివి
గణతంత్ర వేడుకల్లో కొనియాడిన కలెక్టర్‌
అదే స్ఫూర్తితో పనిచేద్దామని యంత్రాంగానికి పిలుపు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 26:
ఉన్నత సంప్రదాయాలకు నెలవు శ్రీకాకుళం జిల్లా అని కలెక్టర్‌ నివాస్‌ కీర్తించారు. సుదీర్ఘ సాహితీ, సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన జిల్లాగా కొనియాడారు. అటువంటి జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో జాతీయ జెండాను కలెక్టర్‌ నివాస్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్‌ డాగ్‌ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం  సమావేశంలో కలెక్టర్‌ కీలక ప్రసంగం చేశారు. ఆయన మాటల్లోనే... ‘జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. కొవిడ్‌ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నాం. కరోనా నిర్థారణ పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమస్థానం సాధించాం. 8లక్షల 23 వేల కొవిడ్‌ పరీక్షలు  చేశాం. ప్రజా భాగస్వామ్యంతో రూ.70 లక్షలతో సర్వజన ఆసుపత్రిలో పీపుల్స్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాం. 10,560 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశాం. దేశ నాయకుల పోరాటాలు వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. వారసత్వ సంపదను కాపాడుకుందాం. రాజ్యాంగం ఉత్కృష్టమైన గ్రంథం.  ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పట్టుకొమ్మలు. ప్రతిఒక్కరూ ఓటును విధిగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రతిఒక్కరూ ఓటు వేయాలి. ఓటు గొప్ప ఆయుధం. పంచాయతీ ఎన్నికల్లో ఓటు ద్వారా ఉన్నతమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. సమున్నత సమాజ నిర్మాణానికి ఎన్నికలను ఆయువుపట్టుగా పరిగణించాలి.. ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. నైపుణ్యం పెంపొందించుకొని అవకాశాలు అందిపుచ్చుకోవాలి. తన కుటుంబం, తన ప్రాంతం, దేశం గర్వించ దగిన ఉన్నతస్థానాలకు యువత ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. నైతిక విలువగల సమాజం ఏర్పాటులో యువత భాగస్థులు కావాలలి. శారీరక వ్యాయామం, యోగా, ధ్యానం, క్రీడలు వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి. సామాజిక రుగ్మతలలపై పోరాటం చేయాలి. జిల్లాకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గొప్ప చారిత్రక ఆనవాళ్లు ఇక్కడ ఉండడం విశేషం. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు కలిగిన జిల్లా మనదని గుర్తుంచుకోవాలి. మత సామరస్యానికి జిల్లా ప్రతీకగా నిలుస్తోంది. అన్ని మతాలు, కులాలు ఐక్యతగా ముందుకు సాగుతుండడం ఇక్కడి ప్రత్యేకత. పోలీస్‌ శాఖ 971 మతసామరస్య కమిటీలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ పరిణామం. జిల్లా సంపూర్ణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి. కొవిడ్‌ సమయంలో సమయంలో అమూల్యమైన సేవలు అందించిన వైద్యసిబ్బంది, పారిశుధ్య, పోలీసు, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, మహిళా ప్రతినిధులు, వలంటీర్లు, మీడియా ఇలా అందరికీ కృతజ్ఞతలు’ అని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు.

కలెక్టర్‌ కంటతడి
 గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ నివాస్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఏమిచ్చి తీర్చాలి నీ రుణం’ అంటూ నగరానికి చెందిన న్యూసెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థులు కొవిడ్‌ వారియర్స్‌ను ఉద్దేశించి ప్రదర్శించిన నృత్య రూపకాన్ని చూసి కలెక్టర్‌ చలించిపోయారు. కలెక్టర్‌తో పాటు అధికారులు కంటతడి పెట్టడం కనిపించింది. కరోనా సమయంలో మరణాలు... బాధితులకు అందించిన సేవలు... ప్రభుత్వ శాఖల సేవలు ప్రస్తావిస్తూ ఈ నృత్యరూపకం సాగింది. కార్యక్రమానికి హాజరైన ఆహూతులను ఆలోచింపజేసింది.





Updated Date - 2021-01-27T05:53:29+05:30 IST