Abn logo
Feb 24 2021 @ 16:04PM

శ్రీదేవి వర్ధంతి స్పెషల్‌: మరో శ్రీదేవి లేదు.. మరి రాదు

పాలరాతిలో మధురస్వప్నం అంటారు తాజ్‌మహల్‌ని. అలా శ్రీదేవిని సెల్యూలాయిడ్‌పైన సుందర శిల్పం అనాలి. వెండి తెర నుంచి రంగుల తెర వరకూ, 35 ఎంఎం నుంచి సినిమా స్కోపు, 70 ఎంఎం వరకూ శ్రీదేవి.. సినిమా సాంకేతికంగా ఎన్ని హొయలు పోతే అన్నిటికీ తనదైన అందాల సుగంధాలను అద్దిన చందన సుందరిగా భారతీయ సినీ చరిత్రకే మరపురాని మధుర స్వప్నమై నిలిచిపోయింది. బాలనటిగా తెరంగేట్రం చేసిన శ్రీదేవి దక్షిణాది భాషలన్నిటిలోనూ పోటీలేని మేటినటిగా ఎదిగి, బాలీవుడ్‌పైన దండెత్తి, జైత్రయాత్రలు చేసి, హిందీ చిత్రపరిశ్రమను చిత్తుచిత్తు చేసింది. ఓ సారి గొల్లపూడి మారుతీరావులాంటి సినీ జీనియస్‌ని టాప్ ఇండియన్ యాక్ట్రస్ ఎవరు అనడిగితే తడుముకోకుండా ఠక్కున శ్రీదేవి.. ఇంకెవరు అని సమాధానమిచ్చారు. మాస్ క్లాస్ ఆడియన్స్‌ని సరిసమానంగా గెలిచిన ఏకైక ఇండియన్ క్వీన్ శ్రీదేవి. 

ఆమె అందుకోని అవార్డులు ఏ భాషలోనూ లేవు. ఆమెకున్నంతమంది అభిమానులు ఏ భాషలోనైనా మరే నటికి గానీ, నటుడికి గానీ లేరు. అక్షరాల సినీసామ్రాజ్యాన్ని శాసించిన పట్టపురాణి శ్రీదేవి. పారితోషకం ఆమె ఎంతంటే అంతే...బాక్సాఫీసులు వడ్డీలతో సహా తిరిగి చెల్లించాయి శ్రీదేవి సినిమాలకి. చాల్బాజ్ సినిమా చాలా కాలం సగంలో ఆగిపోయింది. అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాత. ఇన్నాళ్ళు ఆగిపోయింది కదా.. నష్టం రాదా అనడిగితే శ్రీదేవి ఉంది కదా అన్నారు చాలా ఉదాసీనంగా. అదీ శ్రీదేవి స్టామినా. 

'క్షణక్షణం' సినిమా చేస్తున్నప్పుడు శ్రీదేవితో చేస్తే వెంకటేష్ రేంజ్ పెరుగుతుంది అన్నారు రామానాయుడు. అదీ శ్రీదేవి ఛరిష్మా. స్విమ్మింగ్‌పూల్‌ సైడ్ బికినీలో కనిపించి థియేటర్లో మంటలు పుట్టించిన శ్రీదేవి.. వసంతకోకిల సినిమాలో అమాయకురాలిలా బిక్క మొహం పెడితే అవే థియేటర్ల గుండె బరువెక్కిపోయింది. సెట్లో కూర్చున్నప్పడు వెర్రిపిల్లలా కబుర్లు చెప్పే శ్రీదేవి.. కెమెరా, యాక్షన్ అనగానే మనకి తెలియని కొత్తపిల్లలా, ఆ పాత్రలా ఆ క్షణమే మారిపోయేది. శ్రీదేవి కూర్చుంటే నిలబడి సీనుని వివరించే దర్శకులను ఇండియన్ సినిమా చూసింది. అదొక్క శ్రీదేవికే సాధ్యమైంది. ఎప్పడో మధుబాల, ఎప్పడో వైజయంతీమాల...అప్పుడప్పడు నర్గీస్దత్....అందరి వంతూ శ్రీదేవి ఒక్కర్తే లాక్కుంది. ఇండియన్ హీరోయిన్స్‌ వన్ టు టెన్ శ్రీదేవి మాత్రమే కనిపించే అంత విశాలమైన చరిత్రను తనకు తానే రాసుకున్న ధృవతార శ్రీదేవి. 

హీరోలు ఆమెతో చేయడానికి క్యూలు కట్టారు. దర్శకరచయితలు బారులు తీరారు. అలాటి శ్రీదేవి హఠాత్తుగా ఎక్కడో దుబాయ్‌లో....హోటల్‌లో....బాత్రూంలో....బాత్‌ టబ్‌లో... 2018, ఫిబ్రవరి 24న మునిగి చనిపోయిందంటే....భారతీయ సినిమా బావురుమంది. అత్యధిక అభిమానులు హాజరైన అంత్యక్రియలు ఎవరివైనా ఉంటే ఇండియాలో అవి శ్రీదేవి అంత్యక్రియలే. మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, రాజేష్ ఖన్నాల తర్వాత అంత పబ్లిక్ ఫాలోయింగ్ శ్రీదేవి అంత్యక్రియలకే జరిగింది. పవర్‌లో ఉన్న ప్రధానమంత్రికో.. కేంద్ర, రాష్ట్రమంత్రులకు మాత్రమే నిర్దేశించిన అధికార లాంఛనాలతో అందాల శ్రీదేవి మంటల్లో కలసిపోయింది. శ్రీదేవి సింహాసనం మాత్రం ఖాళీగా అలాగే ఉండిపోయింది. మరొక శ్రీదేవి రాదు. లేదు.

Advertisement
Advertisement
Advertisement