శ్రీశ్రీ నోట గాంధీ గేయం విన్నవేళ

ABN , First Publish Date - 2021-01-04T07:04:41+05:30 IST

మహాత్మాగాంధీపై మహాకవి శ్రీశ్రీ స్పందనలను గురించి, ఆయన భావ పరిణామ క్రమం మేరకు వాటిలో వచ్చిన మార్పుల గురించి మిత్రుడు కొప్పర్తి వెంకటరమణమూర్తి రాసిన వ్యాసం ఆసక్తికరంగా వుంది. కవిగానూ, వ్యక్తిగానూ...

శ్రీశ్రీ నోట గాంధీ గేయం విన్నవేళ

గాంధీపట్ల, ఆయనను కమ్యూనిస్టులు ఎలా 

అర్థం చేసుకోవాలనేదాని పట్ల శిలాసదృశ్యమైన సిద్ధాంతాలు ఏమీ లేవు. పోరాటంలో అహింస 

అన్న సూత్రం పాలవర్గం పాటించదు గనక 

ప్రజలను కట్టేయడం సరికాదన్న భావం మౌలికమైంది. 

గాంధీజీ ఆదర్శమైన నిరాడంబరత్వం చాటున వచ్చిన రాజ్యం భిన్నంగా వుందనేది మరొకటి కాదనలేని నిజం. 


మహాత్మాగాంధీపై మహాకవి శ్రీశ్రీ స్పందనలను గురించి, ఆయన భావ పరిణామ క్రమం మేరకు వాటిలో వచ్చిన మార్పుల గురించి మిత్రుడు కొప్పర్తి వెంకటరమణమూర్తి రాసిన వ్యాసం ఆసక్తికరంగా వుంది. కవిగానూ, వ్యక్తిగానూ శ్రీశ్రీ వ్యక్తీకరణ శైలి, ధాటి, హెచ్చుతగ్గులు దృష్టిలో పెట్టుకునే అంచనాకు రావలసి వుంటుంది తప్ప ప్రతిదీ ఏదో లోతైన సిద్ధాంత స్పందనగా పరిగణించడం వాస్తవికంగా వుండదు. ఎవరి విషయంలోనైనా అంతేగాని శ్రీశ్రీ వంటివారికి మరింత వర్తిస్తుంది. గాంధీ, గాంధీయిజం పేరుతో అధికారంలోకి వచ్చినవారి తీరు కూడా ఆ మార్పులకు కారణం దారితీసే అవకాశముంది.


గాంధీపై శ్రీశ్రీ రాసిన అతిముఖ్యమైన గీతం వాస్తవానికి ఆయన సిద్ధాంత దృష్టిని ప్రతిబింబించేది: ఓ మహాత్మా ఓ మహర్షీ/ ఓ క్షమా పీయూష వర్షీ/ ఎక్కడయ్యా నీ అహింస/ ఏడ నీ కరుణా రిరంస/ చూడు దేశం ద్వేష భుగ్నం/ క్షురత్‌ జిహ్వానల విభుగ్నం’’ అంటూ సూటిగా రాశాడు. ‘‘కలదు సుమా ఒక కర్మచంద్రా/ గతివితర్కం అనే పంథా/ చర్యకొక ప్రతిచర్యలేదా హింస కొక ప్రతిహింస రాదా’’ అని ప్రశ్నించాడు. 1973 ఆగష్టు 14న స్వాతంత్ర దినం సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన ఆకాశవాణి కవి సమ్మేళనం కోసం శ్రీశ్రీ రాసిన ఈ గేయం ఆరుద్ర చదివి వినిపించారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది. కొప్పర్తి వ్యాసంలో దానికి తగినంత ప్రాధాన్యత రాలేదనుకుంటున్నా. నేను అడిగితే అది చూశాకే రాశాననీ, దాన్ని కూడా ఉటంకించానని అన్నారు. కనుక పెద్దగా లోతుల్లోకి పోవడం లేదు.


ఇంతకూ నేను సిద్ధాంత చర్చ కన్నా ఒక జ్ఞాపకం పంచుకో వడానికి రాస్తున్నా. 1974లో కర్నూలు మునిసిపల్‌ హైస్కూలు మైదానంలో జరిగిన విరసం సభల సందర్భంగా శ్రీశ్రీ ఈ గేయాన్ని స్వయంగా ఆలపించడం ఇంకా గుర్తుంది. ‘‘నేను సైతం నిజం సుమ్మీ/ నిన్నొకనాడు పూజించాను నమ్మి’’ అంటూ ఆపి మాట్లాడాడు. ‘‘మా నాన్న లెక్కల మాష్టరు. భగవంతుడు పది అవతరాలు ఎత్తాడు, గాంధీగారు పదకొండో అవతారం అని చెబితే నమ్మి పూజించాను’’ అని వివరించాడు.  


గాంధీపట్ల, ఆయనను కమ్యూనిస్టులు ఎలా అర్థం చేసుకోవా లనేదాని పట్ల శిలాసదృశ్యమైన సిద్ధాంతాలు ఏమీ లేవు. పోరా టంలో అహింస అన్న సూత్రం పాలవర్గం పాటించదు గనక ప్రజలను కట్టేయడం సరికాదన్న భావం మౌలికమైంది. గాంధీజీ ఆదర్శమైన నిరాడంబరత్వం చాటున వచ్చిన రాజ్యం భిన్నంగా వుందనేది మరొక కాదనలేని నిజం. అయితే గాంధీ వ్యక్తిగా దానిలో భాగం పంచుకోలేదని కూడా గుర్తుంచుకోవాల్సిందే. హోచిమన్‌ ఇండియా వచ్చినపుడు కమ్యూనిస్టులకు గాంధీ అంటే పడదు అని చెబితే మా దేశానికి నేనే గాంధీని అన్నారని వామపక్ష అనుకూల చరిత్ర కారులొకరు చెప్పారు. కవులను, కవిత్వాన్ని, నాయకులనూ వారి స్థానాన్ని కూడా పరిణామ క్రమంలోనే అర్థం చేసుకోవాలి. 


తెలకపల్లి రవి

Updated Date - 2021-01-04T07:04:41+05:30 IST