సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్. కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా బిజీ అవుతున్నారు. ఇప్పటికే 'మత్తువదలరా..' చిత్రంతో తనెంటో నిరూపించుకున్న శ్రీసింహ.. తన రెండో చిత్రంగా 'తెల్లారితే గురువారం' చేస్తున్నాడు. "మత్తు వదలరా", "తెల్లవారితే గురువారం" చిత్రాల తర్వాత శ్రీ సింహ నటిస్తున్న మూడో చిత్రాన్ని కూడా మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి 'భాగ్ సాలే' చిత్రాన్ని అనౌన్స్ చేశారు. నిర్మాత డి. సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంలో మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమాండపల్లి "భాగ్ సాలే" చిత్రానికి దర్శకుడు. మంగళవారం శ్రీ సింహ పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్ టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ గతంలో 'పెళ్లి చూపులు', 'ఏబీసీడీ' మరియు 'దొరసాని' వంటి చిత్రాలను రూపొందించాయి. దర్శక నిర్మాతగా మధుర శ్రీధర్ రెడ్డి టాలీవుడ్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ ఆయన 'స్నేహగీతం', 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్', 'లేడీస్ అండ్ జెంటిల్మన్', 'ఏబీసీడీ' వంటి న్యూ ఏజ్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజా చిత్ర విషయానికి వస్తే.. క్రైమ్ కామెడీ జానర్లో 'భాగ్ సాలే' ఉంటుందని అంటున్నారు. మార్చి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.