సేవే యజ్ఞంగా

ABN , First Publish Date - 2021-04-23T05:30:00+05:30 IST

సనాతనాన్ని సనూతనంగా మార్చి లోకానికి బోధించిన ఆధ్యాత్మిక సారథి భగవాన్‌ సత్యసాయిబాబా. మానవ జన్మ మారడం కోసం మాత్రమే కాదు, ‘ఎరగడం’ అంటే తెలుసుకోవడం కోసం కూడానని ఆయన ప్రకటించారు...

సేవే యజ్ఞంగా

సనాతనాన్ని సనూతనంగా మార్చి లోకానికి బోధించిన ఆధ్యాత్మిక సారథి భగవాన్‌ సత్యసాయిబాబా. మానవ జన్మ మారడం కోసం మాత్రమే కాదు, ‘ఎరగడం’ అంటే తెలుసుకోవడం కోసం కూడానని ఆయన ప్రకటించారు. వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్న సనాతన ధర్మాన్ని ఉపదేశవాహినీ స్వరూపంగా... స్వయంగా ఆవిష్కరించారు.



  • 24న శ్రీ సత్యసాయిబాబా పుణ్యతిథి


అవతారమూర్తుల ఉనికి పూర్వం వింధ్య పర్వతాలకు అవతలే ఉండేది. ‘‘నేను తిరిగి వచ్చేదాకా నువ్వు పెరగకుండా ఉండు’’ అని వింధ్యకు చెప్పిన అగస్త్యుడు తిరిగి వెనక్కు వెళ్ళింది లేదు. త్రేతాయుగంలో రామ-రావణ రణంలో, రాముడికి ‘ఆదిత్య హృదయం’ బోధించడానికీ, ద్రాక్షారామంలో వ్యాసుల వారికి స్వాగతం పలకడానికీ దక్షిణాపథంలోనే ఉండిపోయిన అగస్త్యుడు ఇంకా ఇక్కడే ఉండి ఉండాలి. 

సృష్టి అంటేనే ప్రపంచం. అది ప్రదేశంగా అభివ్యక్తమైన కారణంగా విశ్వం అనిపించుకుంది. ‘‘విశ్వం అంటే అద్దంలో బొమ్మ’’ అన్నారు శంకర భగవత్పాదులు. మరి బ్రహ్మ ఎవరు? ఏదో ఒక రూపం ధరిస్తే దానికొక పేరు, గుణం, స్వభావం, ధర్మం... ఇదంతా వ్యక్తమై కనబడే విషయం, ఈ  బ్రహ్మమే శ్రీ మత్స్య, కూర్మ, వరాహ, నరసింహాది అవతారాలుగా వచ్చి,  ఈ ప్రతిబింబంలో జరుగుతున్న అవకతవకలను సరిచేసి, అంటే తనను తానే సరైన రీతిలో దిద్దుకొని, ఆనందాన్ని అద్దుకున్న సందర్భాలు అనేకం. పురాణాలు, ఇతిహాసాలు, కథలు, గాథల ద్వారా ఈ అవతారాల రాకపోకలు అందరూ ఎరిగినవే. వీటిలో శ్రీరాముణ్ణీ, శ్రీకృష్ణుణ్ణీ పూర్ణావతారాలుగా ఆరాధిస్తున్నాం. వారిద్దరూ ఈ నేల మీద ఉన్నంత కాలం... మనుషులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఉపదేశిస్తూ, సందేశాలు ఇస్తూ, ఆదేశిస్తూ తమ పని పూర్తి చేసుకున్నారు. ధర్మమూర్తిగా రామయ్య, కర్మమూర్తిగా కృష్ణయ్య రెండు యుగాలను నడిపించారు. మనిషి అంటే ఏమిటో రాముడు, దేవుడు అంటే ఎవరో కృష్ణుడు తమ పనుల ద్వారా తేటతెల్లం చేశారు. ఇద్దరూ సాగించిందీ, సాధించిందీ ఒక్కటే! అది ధర్మ రక్షణ.


రాముడికి వినడం అలవాటు. దేవకి కొడుకైన కృష్ణుడికి అనడం అలవాటు. రాముడు బుద్ధిమంతుడు, మంచి బాలుడు. తొలినాళ్ళలో ‘యోగ వాశిష్టం విన్నాడు, మలినాళ్ళలో ‘ఆదిత్య హృదయం’ విని, ఉపాసన చేసి, రావణ సంహార కాండను లోకరక్షగా సాగించాడు. మాయకు లోబడినట్టు కనిపించే మహా నటవరుడు రాముడు. ఆయన అవతారం ఎత్తింది వింధ్యకు అవతలే. సీతమ్మను వెతుక్కుంటూ, అందరి ఆర్తినీ తీరుస్తూ వింధ్య ఈవలకు నడిచాడు. కాబట్టి ఈ ప్రాంతం రఘురాముడికి సుపరిచితమే.


గోపాలుడికి ‘అనడం అలవాటు’ అనుకున్నాం కదా! అందుకే ఎప్పుడూ ఎవరి మాటా వినకుండా, అందరూ తన మాట వినేట్టు చేశాడు. ఆయన కూడా రణక్షేత్రాన్ని ఎంచుకొని, ముగియబోతున్న ద్వాపర యుగానికీ, రాబోయే కలియుగానికీ మధ్య ఉన్న సంధి కాలంలో ‘గీత’ అన్నాడు. యుద్ధం చేయించి ధర్మరక్ష చేశాడు. అయితే ఈ అవతారం వింధ్యకు ఇటువైపు ఎన్నడూ వచ్చినది కాదు. ఎందుకిలా చేశావని అడిగితే ‘‘నేను వచ్చానో, రాలేదో నీకు తెలుసా?’’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు. లేదా, ‘‘నేనక్కడే ఉన్నా, నువ్వు చూడలేదేమో?’’ అంటాడు. ‘‘నేను లేనిది ఎక్కడో చెప్పగలవా?’’ అంటాడు కాస్త గంభీరంగా, ఏమైతేనేం, ఆయన వ్యవహారం అంతా అక్కడే!

కాలం ఎప్పుడూ ఒకే విధంగా ప్రవహించదు. దేన్నీ వహించదు. ఎవరినీ సహించదు. నిజం చెప్పాలంటే... అది ఆగదు. ఎప్పుడూ పరుగే! ఎప్పుడూ ముందుకే ప్రయాణం. ఎప్పటికప్పుడే ఎవరినో రప్పించుకొని, తననూ, తన ప్రయాణాన్నీ చక్కదిద్దుకొని... రాబోయే కాలాన్ని స్వాగతిస్తూ ఉంటుంది. నిన్నలో, నేడులో, రేపులో ఉంటూ తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటుంది. ‘యుగం మారడం’ అంటే కాలప్రవాహం మలుపు తిరగడమే. ఆ అందమైన మలుపే మనం ఉంటున్న ఈ కలియుగం.


దేవుడు లేడంటూ ప్రారంభమైన కాలం... కలికాలం. అది దాని రీతి. కాలం పరబ్రహ్మం అనుకుంటే ఈ ప్రపంచం? ‘అది బ్రహ్మం!’ అన్నారు వ్యాసులవారు. ఈ విషయాన్ని సూత్రీకరించారు కూడా. వ్యక్తి కన్నా ముందు ప్రపంచం, ప్రపంచంకన్నా ముందు సృష్టి. మొన్న మొన్నటిదాకా బ్రహ్మం పరిధిని ఆశ్రయించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి అవతార పురుషులు వచ్చారు. ఇకపై వచ్చే అవకాశం లేదు. అంటే ఇదివరకు వచ్చిన తీరులో రారు. మరి మన కాలానికి గతి, సుగతి, సంగతి ఎవరు?


సృష్టికీ, బ్రహ్మానికీ మూలమైన ‘సత్‌’ ఒక్కసారి సంకల్పించుకొని, మళ్ళీ ఇంతకుముందు వచ్చినట్టే వస్తే పని కాదనుకొని... కృతయుగం నాటి సత్యాన్నీ, త్రేతాయుగం నాటి ధర్మాన్నీ, ద్వాపర యుగం నాటి శాంతి, ప్రేమలనూ, కలియుగానికి కావలసిన అహింసనూ ఒక్కటిగా రూపు కట్టి, సనాతన తత్త్వాలను రంగరించుకొని - ‘సత్‌’ సత్యసాయిగా మన ముందుకు వచ్చింది.

సత్యసాయిబాబా మానవుడిలో ఉన్న మాధవుణ్ణి వెతికి పట్టుకొనే మార్గం తెరిచారు. జీవుడు దేవుడేనని స్పష్టం చేశారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణాలను సమన్వయపరిచారు. ‘ప్రేమ దైవ స్వభావం’ అనీ, ‘సేవే అసలైన యజ్ఞం’ అనీ బోధించారు. దైవ స్వరూపంతో, స్వభావంతో పరిచయం లేని ఈ యుగానికి నిరూపణ రూపమే సత్యసాయి అవతారం.

- వి.ఎస్‌.ఆర్‌. మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2021-04-23T05:30:00+05:30 IST