సింగపూర్‌లో ఘనంగా అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం

ABN , First Publish Date - 2020-07-06T05:29:20+05:30 IST

సింగపూర్: ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి' అనే సంస్థ ఆవిర్భావ సందర్భంగా సింగపూర్‌లో ‘అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం’ నిర్వహించారు.

సింగపూర్‌లో ఘనంగా అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం

సింగపూర్: ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ ఆవిర్భావ సందర్భంగా సింగపూర్‌లో ‘అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం’ నిర్వహించారు. 14 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ సుమారు 50 మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు వక్తలుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జూమ్ అంతర్జాల మాధ్యమం ద్వారా ఐదున్నర గంటల పాటు నిర్వహించబడిన ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్, మరియు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆసక్తికరంగా సాగిన ఈ తెలుగు సాహిత్యారాధనలో, వక్తలు తమ వ్యాసాలను కవితలను కథలను పద్యాలను పాటలను మాలికలుగా అల్లి తెలుగు కళామతల్లిని అలంకరించి అర్చించారు. 




శ్రీ సాంస్కృతిక కళాసారథి  సంస్థకు  మరియు  కార్యక్రమంలో పాల్గొన్న  సభ్యులకు  తన శుభాభినందనలను ఆశీస్సులను అందజేస్తూ సామవేదం షణ్ముఖ శర్మ తమ వీడియో సందేశాన్ని, గరికిపాటి నరసింహారావు ఆడియో సందేశాన్ని అందించారు. భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సభకు సంస్థకు శుభాభినందనలు అందజేస్తూ లేఖను పంపారు. 14 దేశాల నుండి అంతర్జాలం ద్వారా ఈ విధమైనటువంటి  కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి కావడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ సదస్సు స్థానం సంపాదించుకుంది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షులు వెంకటాచారి తెలియజేశారు. తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి దీపారాధన చేసి విద్యాధరి లక్ష్మీ వినాయక ప్రార్థనతో పాటు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం ఆలపించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. విశిష్ట అతిథిగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొని, తమ సందేశాన్ని అభినందనలను అందజేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు, సాహిత్యకారులు వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ సినీ సంగీత విశ్లేషకులు మ్యూజికాలజిస్ట్ రాజా గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అభినవ లళకుశులు కంభంపాటి సోదరులు, రెలారెరేలా జానకీరావు పాటలతో అలరించారు. తెలుగు సంస్కృతి గొప్పతనం ఇతివృత్తంగా, రాధాకృష్ణ ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగు వారందరూ కలసి నిర్మించిన ‘అలా సింగపురంలో..’ అనే లఘుచిత్రం ట్రైలర్‌ను, ఆస్ట్రేలియా నుంచి ఉమా మహేష్ రచించిన ‘అక్షరోద్యమం’ అనే పుస్తకాన్ని ఈ సభాముఖంగా ఆవిష్కరించారు. ఖతార్ దక్షిణాఫ్రికా, ఒమాన్, జర్మనీ, సౌదీ అరేబియా మొదలైన దేశాల నుండి పలు రచయితలు ఈ కార్యక్రమం వేదిక ద్వారా తమ రచనలను పంచుకున్నారు..


Updated Date - 2020-07-06T05:29:20+05:30 IST