వైభవంగా శ్రీరామలీలా మహోత్సవం

ABN , First Publish Date - 2020-10-27T10:27:09+05:30 IST

ప్రసిద్ధ రామక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా సోమవారం శమీపూజ వైభవోపేతంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీరామలీలా మహోత్సవం

రాములోరికి మహాపట్టాభిషేకం


భద్రాచలం, అక్టోబరు 26:  ప్రసిద్ధ రామక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా సోమవారం శమీపూజ వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగాశ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను, స్వామి వారి ఆయుధాలను మేళతాళాలతో దసరా మండపానికి తీసుకొచ్చారు. శ్రీ సీతారామచంద్రస్వామికి నిత్యకల్యాణం, శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించారు. నిత్య కల్యాణం నిర్వహించి అనంతరం శ్రీరామాయణ పారాయణ సమాప్తిని పురస్కరించుకొని శ్రీ రామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, కలశ స్థాపన, రామాయణంలోని పట్టాభిషేక ఘట్ట పారాయణం, కిరీటధారణ, కలశ జలాలతో స్వామి వారికి ప్రోక్షణ, వేదాశీర్వచనం, మంగళహారతి నిర్వహించారు. దసరాను పురస్కరించుకొని పది రోజుల పాటు శ్రీమద్రారామాణ పారాయణం నిర్వహించే సమయంలో నిత్య హోమం నిర్వహించారు. కాగా చివరి రోజున పూర్ణాహుతి గావించారు. 


సంప్రదాయంగా శమీపూజ

శ్రీ సీతారామచంద్రస్వామికి మహారాజు అలంకారం చేసి భాజభజంత్రీలు, మేళతాళాలతో విజయోత్సవం, శమీ పూజ కోసం స్థానిక దసరా మండపం వద్దకు తీసుకొచ్చారు. తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించారు. తరువాత సంప్రోక్షణ నిర్వహించి షోడపోచారాతో శమీ వృక్షానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  జమ్మి పత్రాలు అక్షింతలతో అర్చన చేసి చివరగా వాటిని భక్తుల శిరస్సుపై చల్లారు. అనంతరం శ్రీరామ లీలా మహోత్సవాన్ని నిర్వహించగా వందలాది మంది భక్తులు తిలకించారు. ఈ సమయంలో రావణాసుర బొమ్మపై బాణాన్ని దేవస్థానం ఈవో బి.శివాజీ సంధించారు. 


కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తులు క్యూ పద్ధతిలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో భద్రాచలం  దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, పర్యవేక్షకులు భవానీ రామకృష్ణారావు, శ్రీనివాస్‌, నిరంజన్‌కుమార్‌, లింగాల సాయిబాబా, డీఈ వి.రవీంద్రనాథ్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, ఇతర వైదిక, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T10:27:09+05:30 IST