రామా.. మము బ్రోవరా!

ABN , First Publish Date - 2021-04-22T05:15:24+05:30 IST

నెల్లూరు నగరంలో శ్రీరామ నవమిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలు జరిగాయి. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వీటిని ఏకాంతంగా నిర్వహించారు.

రామా.. మము బ్రోవరా!
విశేష అలంకరణలో సంతపేట ఆంజనేయస్వామి

భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి


నెల్లూరు(సాంస్కృతికం), ఏప్రిల్‌ 21 :

నెల్లూరు నగరంలో శ్రీరామ నవమిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.  ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలు జరిగాయి. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వీటిని ఏకాంతంగా నిర్వహించారు. 

ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని కుర్తాళం పీఠ ఆస్థాన అర్చకుడు మాచవోలు రమేష్‌శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. ఉదయం కార్యసిద్ధి అభయ ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేకాలు, పూజలు జరిగాయి. అనంతరం శ్రీరామ రక్షా హోమం జరిగింది. రాత్రి సీతారామ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరిమిత సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.


మహాత్మాగాంధీ నగర్‌లోని కృష్ణ మందిరంలో, బాలాజీనగర్‌లో ఉన్న సీతారామ మందిరంలో, ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాలు జరిగాయి. 


స్టోన్‌హౌస్‌పేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శాశ్వత ఉభయకర్తలైన గుండ్లపల్లి సుధాకర్‌రావు, ఆషారాణి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిగింది. 


పప్పుల వీధి ఆంజనేయస్వామి  ఆలయంలో వసంత కొఠాయి ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. 


 అయ్యప్పగుడిలోని గురువాయురప్పన్‌ మహావిష్ణు ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. 


సంతపేట ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉదయం ధ్వజారోహణం జరిగింది. అనంతరం తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. రాత్రి స్వామి వారు కమలంపై ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్‌ గంధం సురేష్‌కుమార్‌, ఈవో దుర్గయ్య, ధర్మకర్తలు పర్యవేక్షించారు. 


షిరిడీ సాయిబాబా మందిరాల్లో....

నగరంలోని షిరిడీసాయిబాబా మందిరాల్లో నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. గాంధీనగర్‌ సాయిబాబా మందిరంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, సహస్రనామ పూజలు జరిగాయి. సాయంత్రం భక్తులకు ఉచిత దర్శనం కల్పించారు. బాలాజీనగర్‌లోని అద్దాల సాయిబాబా మందిరం, సాయిదర్బార్‌లో శ్రీరామనవమి పూజలు ఘనంగా జరిగా యి. బాబాకు ప్రత్యేక అలంకారం జరిగింది. చిల్డ్రన్స్‌పార్కు సాయిసదన్‌లో  ఉదయం విశే ష పూజలు, సాయంత్రం గంధమహోత్సవం, పష్ప పల్లకి ఉత్సవం ఏకాంతంగా జరిగాయి. 



Updated Date - 2021-04-22T05:15:24+05:30 IST