Abn logo
Oct 25 2020 @ 02:56AM

మహా సామ్రాజ్ఞి.. శ్రీరాజరాజేశ్వరీ దేవి

ఆర్ష సాంప్రదాయంలో సంవత్సరంలోని ప్రతి మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. అయితే జ్యోతిషపరంగా ఈ పన్నెండు నవరాత్రులలో నాలుగు మాత్రమే గుర్తింపు పొందాయి. వాటిలోనూ రెండింటిని ప్రకటిత నవరాత్రులు అంటారు. అవి చైత్ర, ఆశ్వయుజ మాసాల్లో వచ్చే వసంత, శరన్నవరాత్రులు. మిగతా రెండింటినీ ‘గుప్త నవరాత్రులు’గా వ్యవహరిస్తారు. అవి మార్గశిర, ఆషాఢ మాసాల్లో వచ్చేవి. సాధువులు, తాంత్రికశక్తి ఉపాసకుల ఆరాధనకు ముఖ్యమైన రోజులవి. ఇక, శరన్నవరాత్రుల విషయానికి వస్తే.. ఈ తొమ్మిది రోజులూ ఆదిపరాశక్తిని ఆరాధించడం ద్వారా జన్మజన్మల పాపాలూ, కష్టాలు దూరమవుతాయి. అమ్మవారిని ఈ తొమ్మిది రోజులూ శైలపుత్రి (గాయత్రి), బ్రహ్మచారిణి (బాలాత్రిపురసుందరి), చంద్రఘంటా (అన్నపూర్ణ), కూష్మాండ (మహాలక్ష్మి), స్కందమాత (లలితాత్రిపురసుందరి), కాత్యాయని (సరస్వతి), కాళరాత్రి (దుర్గాదేవి), మహాగౌరి (మహిషాసురమర్దనిా), సిద్ధిదాత్రి (రాజరాజేశ్వరిదేవి)గా అలంకరించి పూజిస్తారు.


ఈ మూర్తులన్నింటికీ మూలమైనది, అపార కరుణామూర్తి, సకలసిద్ధులనూ ప్రసాదించే వరదాయిని, విశ్వసామ్రాజ్యానికి అధినేత్రి.. శ్రీరాజరాజేశ్వరీమాత. షోడశాక్షరీ మంత్రాధిష్ఠాన దేవత. ఒక చేతిలో చెరకుగడను పట్టుకొని సింహాసనంపై కూర్చొని, మరొక చేతితో అభయముద్ర ధరించి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. తియ్యటి చెరుకు.. ఆనందాన్ని, హాయిని సూచిస్తుంది. అదే ఆత్మజ్ఞానానికి, స్వీయ సాక్షాత్కారానికి సూచిక. దుష్ట శిక్షణకు పాశాంకుశాలను ధరించి ఉంటుంది. ఆమెయే అపరాజిత. సృష్టి, స్థితి, లయాలను నిర్వర్తించేది ఆ మహాదేవియే.


చితాభస్మాది లేపో గరళ మశనం దిక్పట ధరో

జటాధరీ కంఠే భుజగపతి హారీ పశుపతిః 

కపాలీ భూతేశో భజతి జగతీశైక పదవీం

భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటే ఫలమిదం 


’ఒంటికి చితాభస్మాన్ని పులుముకునేవాడు, విషమే ఆహారమైనవాడు, దిక్కులే వస్త్రాలుగా గలవాడు, తలపై జటలను కలిగినవాడు, పాములను హారములుగా మెడలో ధరించినవాడు, పశువులకు పతి, చేతిలో పుర్రెను ధరించినవాడు, భూతనాథుడు అయినప్పటికీ శంకరుడు ముల్లోకాలకు ప్రభువైనాడంటే ఓ భవుని రాణీ.. అది నిన్ను  పరిణయమాడినందువల్లనే కదా!’’ అంటూ శ్రీరాజరాజేశ్వరిదేవి కరుణా విశేషాన్ని ఆది శంకరాచార్యులవారు తన అపరాధ క్షమాపణ స్తోత్రంలో అద్భుతంగా వివరించారు. భవుని భావమే భవాని. భవభయబాధలను పరిహరించి, భవాన్ని విభావంగా మార్చగల మహోదాత్తశక్తి రూపిణి ఆ తల్లే. అలాగే, ఆ జగన్మాతకు.. ‘నామపారాయణాభీష్ఠ ఫలదాయైు నమః’ అన్న నామం ఉంది. తల్లి నామాలు పారాయణ చేస్తే అపమృత్యు దోషం పోతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ఆత్మస్థైర్యం అబ్బుతుంది. జగన్మాత నామాన్ని నిత్యం, భక్తితో జపించగా, జపించగా తనకు, తల్లికి భేదం లేదని, తల్లి చైతన్యమే అందరిలోనూ ఉన్నదని గోచరమవుతుంది. అద్వైతభావన అంకురిస్తుంది. తను చేసే ప్రతి కార్యం దైవకార్యంగా అనిపిస్తుంది. సాధన పరిపక్వమైన తదుపరి ఆ తల్లి కృపతో భక్తుడు జీవబ్రహ్మైక్య స్థితిని పొందుతాడు.

 డా.మునగా రామమోహనరావు, 9840091400

Advertisement
Advertisement
Advertisement