Dindugal: శ్రీలంక శరణార్థులకు శాశ్వత నివాసం

ABN , First Publish Date - 2022-09-15T15:59:21+05:30 IST

దిండుగల్‌(Dindugal) జిల్లాలో శ్రీలంక శరణార్థుల పునరావాస ప్రాంతంలో రూ.17.84 కోట్లతో నిర్మించిన 321 నివాసాలను ముఖ్యమంత్రి ఎంకే

Dindugal: శ్రీలంక శరణార్థులకు శాశ్వత నివాసం

                        - దిండుగల్‌ జిల్లాలో గృహాలను ప్రారంభించిన సీఎం


చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): దిండుగల్‌(Dindugal) జిల్లాలో శ్రీలంక శరణార్థుల పునరావాస ప్రాంతంలో రూ.17.84 కోట్లతో నిర్మించిన 321 నివాసాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఆ జిల్లాలో తోట్టనూత్తు, అడియనూత్తు, గోపాల్‌పట్టి ప్రాంతాల్లో శ్రీలంక తమిళ శరణార్థులు అరకొర వసతులతో కూడిన పునరావాస కేంద్రాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు 27న శాసనసభలో  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దిండుగల్‌ జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఉన్న శ్రీలంక తమిళ శరణార్థులను ఒకే ప్రాంతానికి చేర్చి వారికి అన్ని సదుపాయాలతో పక్కా ఇళ్ళను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు 3.05 హెక్లార్లలో 300 చదరపుటడుగుల విస్తీర్ణం కలిగిన 321 నివాసాలను నిర్మించారు. ఆ ప్రాంతంలో రూ.1.62 కోట్లతో సిమెంట్‌ రహదారులు, అంగన్‌వాడీ(Anganwadi) కేంద్రం, 78 వీథిదీపాలు, సమగ్రమంచినీటి పథకం ట్యాంక్‌ తదితర వసతులు కూడా కల్పించారు. ఈ కొత్త నివాసగృహాలను చెన్నైలోని క్యాంపు ఆఫీసు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ప్రజాపనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డి.జగన్నాధన్‌(D. Jagannadhan) సమక్షంలో స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. తోట్టనూత్తువద్ద ఏర్పాటైన ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రులు పెరియసామి, చక్రపాణి, సెంజి కేఎస్‌ మస్తాన్‌, ఎంపీ వేలుసామి, ఎమ్మెల్యేలు సెంథిల్‌కుమార్‌, గాంధిరాజన్‌ దిండుగల్‌ మేయర్‌ ఇలమది జ్యోత్రిపకాష్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌. విశాఖన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-15T15:59:21+05:30 IST