దేశంలో ఆకలి కేకలు : శ్రీలంక పార్లమెంటు స్పీకర్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-04-06T21:43:03+05:30 IST

దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉందని, ఇది మరింత పెరిగి

దేశంలో ఆకలి కేకలు : శ్రీలంక పార్లమెంటు స్పీకర్ హెచ్చరిక

కొలంబో : దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉందని, ఇది మరింత పెరిగి, దేశవ్యాప్తంగా ప్రజలు ఆకలి బాధతో అలమటించే పరిస్థితులకు దారి తీయవచ్చునని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ మహీంద యాపా అభయవర్దన బుధవారం హెచ్చరించారు. ఇదిలావుండగా, దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేయబోరని చీఫ్ గవర్నమెంట్ విప్ జాన్‌స్టన్ ఫెర్నాండో పార్లమెంటులో చెప్పారు. 


పార్లమెంటులో బుధవారం ఫెర్నాండో మాట్లాడుతూ, ఆర్థిక సంక్షోభం వల్ల ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం ఎదుర్కొంటుందన్నారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయవలసిన అవసరం లేదన్నారు. దేశంలో హింసాకాండ వెనుక జనతా విముక్తి పెరమునవస్ పార్టీ ఉందన్నారు. ఈ దౌర్జన్యపూరిత రాజకీయాలను అనుమతించబోమని తెలిపారు. హింసను విడనాడాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ గొటబయ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. 


గత వారం కొలంబోలోని తన నివాసం వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన నేపథ్యంలో దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్, విద్యుత్తు, పాల పొడి వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. రాజపక్స, ఆయన ప్రభుత్వం రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మంగళవారం రాత్రి దేశంలో అత్యవసర పరిస్థితిని ఉపసంహరిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. 


రక్తపాతానికి దారి తీయబోదని ఆశిస్తున్నా : అర్జున రణతుంగ

శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ,  పరిపాలనలో దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స విఫలమయ్యారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నియమించాలన్నారు. తాను రాజకీయాలు మాట్లాడటం లేదని, సామాన్యుల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. ఈ సంక్షోభ పరిస్థితులు దేశంలో రక్తపాతానికి దారితీయబోవని ఆశిస్తున్నానన్నారు. 


ప్రభుత్వంపై నిరసనల్లో వైద్యులు 

కొలంబోలోని ఆసుపత్రుల్లో అత్యవసర మందులు సైతం అందుబాటులో లేకపోవడంతో వైద్యులు బుధవారం నిరసన తెలిపారు. 


Updated Date - 2022-04-06T21:43:03+05:30 IST