Chinese Spy Ship : చైనా గూఢచర్య నౌక శ్రీలంకకు రావడం వెనుక ఆ వ్యక్తి లాబీయింగ్!

ABN , First Publish Date - 2022-08-16T21:07:54+05:30 IST

శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయం (Hambantota Port)లోకి చైనీస్

Chinese Spy Ship : చైనా గూఢచర్య నౌక శ్రీలంకకు రావడం వెనుక ఆ వ్యక్తి లాబీయింగ్!

కొలంబో : శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయం (Hambantota Port)లోకి చైనీస్ గూఢచర్య నౌక రావడం వెనుక శ్రీలంక నావికా దళం మాజీ అధిపతి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సముద్ర సంబంధిత పరిశోధనల నెపంతో ఈ నౌకను చైనా (China) ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ నౌకను అనుమతించవద్దని భారత దేశం (India) అనేకసార్లు అభ్యంతరం తెలిపినప్పటికీ శ్రీలంక (Sri Lanka) పట్టించుకోలేదు. 


శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయాన్ని చైనాకు 99 సంవత్సరాలకు కౌలు (Lease)కు ఇచ్చారు. ఇక్కడికి యువాన్ వాంగ్ 5 (Yuan Wang 5) మంగళవారం ఉదయం 4.00 గంటలకు చేరుకుంది. ఇది ఈ నౌకాశ్రయంలో ఆగస్టు 21 వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇది ఉపగ్రహ సమాచారంతో, బ్యాలిస్టిక్ క్షిపణుల జాడను గుర్తించే వ్యూహాత్మక నౌక. అయితే ఇది మెరైన్ సైంటిఫిక్ రీసెర్చ్ నౌక అని చైనా చెప్తోంది. 


ఈ నౌక ఈ నెల 11 నుంచి 17 వరకు ఈ నౌకాశ్రయంలో ఉంటుందని మొదట్లో ప్రకటించారు. అయితే మరిన్ని చర్చలు అవసరమని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) నేతృత్వంలోని ప్రభుత్వం చెప్పింది. కానీ చైనా ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. దివాలా తీసిన శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) రుణాలను అడ్డుకుంటామని చైనా హెచ్చరించడంతో శ్రీలంక తలొగ్గక తప్పలేదు. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ గూఢచర్య నౌక రాకను విక్రమసింఘే ప్రభుత్వం వాయిదా వేయడంపై శ్రీలంక మాజీ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి, మాజీ నావికా దళ చీఫ్ రియర్ అడ్మిరల్ సరత్ వీరసేకర (Sarath Weerasekara) బహిరంగంగానే విరుచుకుపడ్డారు. దీనినిబట్టి శ్రీలంకలో చైనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విక్రమసింఘే, ప్రధాన మంత్రి దినేశ్ గుణవర్దన, చైనా సన్నిహితుడు మహింద రాజపక్స (Mahinda Rajapaksa)లతో సరత్ వీరసేకర లాబీయింగ్ చేశారు. దీంతో హంబంటోటా నౌకాశ్రయానికి ఈ గూఢచర్య నౌకకు అనుమతి లభించింది. 


శ్రీలంకలోని దౌత్యవేత్తలు చెప్తున్నదాని ప్రకారం, పరిశోధనల సాకుతో హిందూ మహా సముద్ర ప్రాంతంలోకి వస్తున్న చైనీస్ గూఢచర్య నౌకలు గత దశాబ్దంలో బాగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసినా కనీసం మూడు నుంచి ఐదు గూఢచర్య నౌకలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. 


Updated Date - 2022-08-16T21:07:54+05:30 IST