Sri Lanka Crisis : సైనిక తిరుగుబాటు ప్రసక్తే లేదు : శ్రీలంక డిఫెన్స్ చీఫ్

ABN , First Publish Date - 2022-05-12T01:55:47+05:30 IST

రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో సైనిక తిరుగుబాటు

Sri Lanka Crisis : సైనిక తిరుగుబాటు ప్రసక్తే లేదు : శ్రీలంక డిఫెన్స్ చీఫ్

కొలంబో : రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో సైనిక తిరుగుబాటు ప్రసక్తే లేదని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమల్ గుణరత్నే స్పష్టం చేశారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ బావించవద్దని చెప్పారు. సైన్యానికి అటువంటి ఉద్దేశాలేవీ లేవన్నారు. 


శ్రీలంక (Sri Lanka)లో జరిగిన వేర్పాటువాద ఉద్యమాన్ని 2009లో తుదముట్టించిన అంతిమ యుద్ధంలో గుణరత్నే టాప్ ఫీల్డ్ కమాండర్‌గా పని చేశారు. దశాబ్దాల తరబడి జరిగిన తమిళ టైగర్స్ వేర్పాటువాద ఉద్యమం ఈ యుద్ధంతో ముగిసింది. ఆ సమయంలో ఆయన కన్నా ఉన్నత స్థాయి కమాండర్‌గా ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పని చేశారు. 


శ్రీలంకలో ప్రజల నిరసనలు వెల్లువెత్తుతుండటంతో గొటబయ రాజపక్స ఇటీవల కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారిక నివాసానికి పరిమితమయ్యారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఐక్య ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస ఇచ్చిన ఓ ట్వీట్‌లో, కోపోద్రిక్తులైన ప్రజా సమూహాల ముసుగులో హింసను రెచ్చగొడుతున్నారని, సైనిక పాలనను ఏర్పాటు చేయడానికి ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు Social Media Users దేశంలో సైనిక పాలన రాబోతోందని అంచనా వేస్తున్నారు.  దేశవ్యాప్తంగా సైన్యాన్ని మోహరించడం రాజకీయ అధికారాన్ని సైన్యం కైవసం చేసుకోవడానికి మొదటి అడుగు అని చెప్తున్నారు.  శ్రీలంకలో సుదీర్ఘ కాలం అంతర్యుద్ధాలు జరిగాయి, శక్తిమంతమైన సాయుద దళాలు ఉన్నాయి, అయినప్పటికీ ఈ దేశంలో సైనిక పాలన రాలేదు. అయితే 1962లో సైనిక తిరుగుబాటుకు ప్రయత్నం జరిగింది. కానీ కనీసం ఒక తూటా అయినా పేలకుండానే ఇది ముగిసింది. 


ఈ నేపథ్యంలో కమల్ గుణరత్నే విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినపుడు, చక్కదిద్దేందుకు సైన్యానికి అధికారాలు ఇస్తారన్నారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సైన్యం ప్రయత్నిస్తోందని ఎన్నడూ అనుకోవద్దన్నారు. సైన్యానికి అటువంటి ఉద్దేశాలేవీ లేవని చెప్పారు. 


శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై ప్రభుత్వ విధేయులు దాడి చేయడంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దేశంలో ఎమర్జెన్సీ, కర్ప్యూ అమలవుతున్నాయి. హింసకు పాల్పడేవారు కనిపిస్తే కాల్చేయాలని ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది. సైన్యం వీథుల్లో గస్తీ తిరుగుతోంది. 



మహింద రాజపక్స సోమవారం ప్రధాన మంత్రి  పదవికి రాజీనామా చేయడంతో సాధ్యమైనంత త్వరగా సభను సమావేశపరచాలని పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సను కోరారు. 


Read more