శాంతియుత పరిష్కారానికి సహకరించండి : ప్రజలకు శ్రీలంక సైన్యాధిపతి విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-07-10T18:58:52+05:30 IST

దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన పాలకులపై శ్రీలంక ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు

శాంతియుత పరిష్కారానికి సహకరించండి : ప్రజలకు శ్రీలంక సైన్యాధిపతి విజ్ఞప్తి

కొలంబో : దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన పాలకులపై శ్రీలంక ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు. నిత్యావసరాలు సైతం అందుబాటులో లేకపోవడంతో దేశాధ్యక్షుడి నివాసంపై దాడి చేశారు. ప్రధాన మంత్రి ప్రైవేట్ ఇంటిని తగులబెట్టారు. ఈ నేపథ్యంలో ఆ దేశ సైనికాధిపతి షవేంద్ర సిల్వ స్పందిస్తూ, శాంతియుత పరిస్థితులు ఏర్పడటానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. 


మరోవైపు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే పార్లమెంటులో ఆధిక్యతను నిరూపించుకునేందుకు అవసరమైన 113 మంది సభ్యుల మద్దతును సునాయాసంగా సాధించవచ్చునని ప్రతిపక్ష నేత ఎంఏ సుమంతిరన్ చెప్పినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. 


మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో శ్రీలంక ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసరాలు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే కూడా ఈ ఆగ్రహానికి గురికాక తప్పలేదు. గొటబయ నివాసంపై దాడి చేసిన నిరసనకారులు, అక్కడి ఈత కొలనులో ఈదులాడారు. 


పీఎం రణిల్ విక్రమసింఘే (Ranil Wickramsinghe) ప్రైవేటు గృహాన్ని నిరసనకారులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో గొటబయ, రణిల్ తమ పదవుల నుంచి వైదొలగడానికి శనివారం అంగీకరించారు. బిలియన్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రతిపక్ష పార్టీలు ఆదివారం సమావేశం కాబోతున్నాయి.


శ్రీలంక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ షవేంద్ర సిల్వ ప్రజలను ఉద్దేశించి ఓ ప్రకటన  జారీ చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశం లభించిందని తెలిపారు. దేశంలో శాంతియుత పరిస్థితులు కొనసాగడానికి రక్షణ దళాలకు, పోలీసులకు సహకరించాలని కోరారు. 


ప్రతిపక్షాల సమావేశం ఆదివారం

నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రతిపక్ష పార్టీలు ఆదివారం సమావేశమవుతాయి. పార్లమెంటులో ఆధిక్యతను నిరూపించుకునేందుకు అవసరమైన 113 మంది ఎంపీల బలం ప్రతిపక్షాలకు ఉందని ప్రతిపక్ష ఎంపీ ఎంఏ సుమంతిరన్ (MA Sumanthiran) చెప్పారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు ఆగాలని, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మాత్రమే దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని గొటబయ రాజపక్సను ప్రతిపక్ష సభ్యులు కోరుతారని తెలిపారు. 


ఐఎంఎఫ్ ఉద్దీపన ప్యాకేజ్

శ్రీలంకకు ఉద్దీపన ప్యాకేజ్‌పై ప్రభుత్వం, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) చర్చలు జరుపుతున్నాయి. మూడు (3) బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజ్‌ (Bailout Package)పై చర్చలు జరుగుతున్నాయి. ఐఎంఎఫ్ ఆదివారం స్పందిస్తూ, శ్రీలంక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితి పరిష్కారమవుతుందని, తద్వారా ఉద్దీపన ప్యాకేజీపై చర్చల పునరుద్ధరణకు అవకాశంకలుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. 


రాజీనామా చేస్తా : రాజపక్స

తాను జూలై 13న తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స శనివారం తెలిపారు. ప్రధాన మంత్రి విక్రమసింఘే కూడా నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు మాత్రమే పదవిలో ఉంటారన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటవడానికి ముందే వీరిద్దరూ రాజీనామా చేస్తే, ఆ దేశ రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన దేశాధ్యక్ష పదవిని తాత్కాలికంగా చేపడతారు. 


గొటబయ రాజపక్స రాజీనామా చేయాలని నిరసనకారులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి ఆయన ఆయన సోదరుడు (మాజీ ప్రధాన మంత్రి) మహింద రాజపక్స (Mahinda Rajapaksa) కారణమని మండిపడుతున్నారు. గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) నివాసంపై వేలాది మంది దాడి చేసిన తర్వాత ఆయన ఆచూకీ తెలియడం లేదు. 


Updated Date - 2022-07-10T18:58:52+05:30 IST