శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పతాకస్థాయికి చేరుకుంది. గురువారం దేశవ్యాప్తంగా డీజిల్ అమ్మకాలు నిలిచిపోయాయి. బస్సులు, కమర్షియల్ రవాణా వాహనాలకు ఇంధనం దొరక్కపోవడంతో రవాణ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. మరోపక్క పెట్రోలు కూడా అంతంతమాత్రంగానే దొరుకుతోంది. ఫలితంగా పెట్రోల్‌తో నడిచే వాహనాలు కిలోమీటర్ల మేర పెట్రోలు బంకులవద్ద బారులు తీరాయి. శుక్రవారం నుంచి ప్రైవేటు బస్సు సర్వీసులు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం గ్యారేజ్‌లలో రిపేర్ల కోసం దాచి ఉంచిన డీజిల్‌ను తీసి, అత్యవసర వాహనాలకు వాడుతున్నట్లు శ్రీలంక రవాణాశాఖ మంత్రి చెప్పారు. మరోవైపు దేశంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. శుక్రవారం నుంచి దాదాపు 13 గంటలపాటు విద్యుత్ కోతలు విధించనున్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటించాయి.
మరో రెండు రోజుల్లో చమురు అందుబాటులోకి వస్తుందని, దాంతో విద్యుత్ సరఫరా మెరుగవుతుందని విద్యుత్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. విద్యుత్ సంక్షోభంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైద్యరంగం కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు, మెడిసిన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో హాస్పిటల్స్‌లో సర్జరీలు ఆగిపోయాయి. ప్రస్తుతం చమురు కొనేందుకు శ్రీలంక దగ్గర విదేశీ మారక నిల్వలు కూడా లేవు. దీంతో ఈ సంక్షోభం మరికొంతకాలం కొనసాగనుంది.