శ్రీలంక: నూతన మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం!

ABN , First Publish Date - 2022-07-11T21:09:02+05:30 IST

కొలంబో: సంక్షోభం నెలకొన్న శ్రీలంకలో ఆర్ధిక రంగ దిద్దుబాటు సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ఓ పరిష్కారం కనపడే అవకాశాలున్నాయి.

శ్రీలంక: నూతన మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం!

కొలంబో: సంక్షోభం నెలకొన్న శ్రీలంకలో ఆర్ధిక రంగ దిద్దుబాటు సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ఓ పరిష్కారం కనపడే అవకాశాలున్నాయి. రాజీనామాకు సిద్ధమని అధ్యక్షుడు రాజపక్స, ప్రధాని విక్రమ సింఘే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. విపక్షాలన్నీ కలిసి నూతన మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీల నేతలు నిన్న సమావేశమై చర్చలు జరిపారు. రాజపక్స రాజీనామా అనంతరం తాత్కాలికంగా అన్ని పార్టీలూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. నూతన మధ్యంతర ప్రభుత్వంలో అన్ని పార్టీల ప్రతినిధులూ ఉంటారు. కొన్నాళ్లపాటు మధ్యంతర ప్రభుత్వం కొనసాగాక పార్లమెంటరీ ఎన్నికలకు వెళ్లాలని ప్రధాన ప్రతిపక్షమైన ఎస్‌జేబీ భావిస్తోంది. 


మరోవైపు ప్రధానమంత్రి విక్రమసింఘే కార్యాలయంలో ఈ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరిగింది. అన్ని పార్టీలతో నూతన మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కాగానే తమ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమని కేబినెట్ మంత్రులు ప్రకటించారు. బుధవారం రాజీనామా చేసే విషయంపై అధ్యక్షుడు రాజపక్స నుంచి విక్రమసింఘేకు స్పష్టత వచ్చిన నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 


కరోనా మహమ్మారి ప్రభావం, పర్యాటక రంగం కుదేలవడం, నిరుద్యోగం విపరీతంగా పెరగడం, తీవ్ర ఆహార కొరత, ఏక కుటుంబ పాలన, పాలకుల అనాలోచిత ధోరణి, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం, సులభతర విదేశీ రుణాలపై విపరీతంగా ఆధారపడటం ఇలా చాలా కారణాలు శ్రీలంకను కోలుకోలేని ఆహార, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. శ్రీలంకకు ఏటా పర్యాటక రంగం నుంచి 360 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరితే, కరోనా కారణంగా ఇది 60 కోట్ల డాలర్లకు పడిపోయింది. పర్యాటక రంగంపై ఆధారపడిన దాదాపు 30 లక్షలమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. 


ఇటీవలి వరకూ రాజపక్స సోదరులు, మంత్రివర్గంలో ఉన్న వారి బంధువులు తీసుకున్న నిర్ణయాలు, బంధుప్రీతి, అవినీతికి పాల్పడటంతోపాటు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించారు. ప్రజలను ఆకర్షించి పదవిలోకి రావడంకోసం విపరీతమైన ప్రజాకర్షక హామీలు ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అవసరాలు తీర్చుకోవడం కోసం కరెన్సీని 42 శాతం అధికంగా ముద్రించడం, ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి మించడం ఇలా ఒకదాని పర్యవసానం మరొక దానిపై తీవ్రంగా పడింది.


చైనా నుంచిదిగుమతి చేసుకునే ఎరువులు నాణ్యతగా లేకపోవడం వల్ల వేరే దేశాలనుంచి దిగుమతి చేసుకోవాలంటే సరిపడిన డాలర్లు (విదేశీ మారక ద్రవ్యం) లేకపోవడం, ఫలితంగా 100 శాతం సేంద్రీయ వ్యవసాయానికి అడుగులు వేయడం, అది సత్ఫలితాలను ఇవ్వకపోగా తీవ్ర తిండి గింజల కరువుకు దారి తీసింది. 


చివరికి విదేశీ సంస్థలు, ప్రపంచ దేశాలకు అప్పుకట్టలేని స్థితిలో శ్రీలంక ఉంది. అప్పులు కట్టలేమని బహిరంగంగా ప్రకటించింది కూడా.  ప్రస్తుతం ఆహార సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులతోపాటు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. కాగితం, సిరా కొరతతో కనీసం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కూడా వాయిదా వేశారు. డీజిల్‌ విక్రయాల నిలిపివేత, రోజుకు 15 గంటల కరెంటు కోత ఇలా చాలా సమస్యలను శ్రీలంక ఎదుర్కుంటోంది. 


శ్రీలంకలో ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు కేవలం 150 కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడానికి, అప్పులు తీర్చడానికి నానా తంటాలు పడుతోంది. సులభతర రుణాలకు అలవాటు పడి కేవలం చైనా నుంచి 350 కోట్ల డాలర్ల అప్పు తీసుకున్న శ్రీలంక వాటిని తిరిగి చెల్లించలేక దేశంలోని కొన్ని ఆస్తులను అమ్మే పరిస్థితికొచ్చింది. శ్రీలంకలోని హంబన్‌ టోట పోర్టును 99 సంవత్సరాలకు 75 శాతం కంట్రోల్‌ని చైనా తీసుకుంది. ఇలా స్వదేశంలోని ఆస్తులపైనా శ్రీలంక పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2022-07-11T21:09:02+05:30 IST