Srilanka: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ సింఘే సంచలన నిర్ణయం.. లంక సైన్యానికి కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2022-07-13T22:10:14+05:30 IST

తీవ్ర సంక్షోభంతో (Srilanka Crisis) కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో (Srilanka) పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. నిరసనకారులు ప్రధాని భవనం, అధ్యక్ష భవనంలోకి వెళ్లి..

Srilanka: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ సింఘే సంచలన నిర్ణయం.. లంక సైన్యానికి కీలక ఆదేశాలు

కొలంబో: తీవ్ర సంక్షోభంతో (Srilanka Crisis) కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో (Srilanka) పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. నిరసనకారులు ప్రధాని భవనం, అధ్యక్ష భవనంలోకి వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. దీంతో.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ సింఘే (Ranil Wickremesinghe) సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు లంక సైన్యానికి (Srilanka Army) కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలో అది చేయండని, అవసరమైతే కనిపిస్తే కాల్చివేయండని కూడా సైన్యానికి స్పష్టం చేసినట్టు తెలిసింది.



ఫాసిస్టుల చేతుల్లోకి దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనీయనని రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యానించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తప్పుకునేలా చేయాలని విధ్వంసకారులు చూస్తున్నారని ఆయన చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు శ్రీలంక పోలీసులు, సైన్యానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ సింఘే స్పష్టం చేశారు.



ఇదిలా ఉండగా.. శ్రీలంకలో పరిస్థితులు ఏ స్థాయికి చేరుకున్నాయంటే నిరసనకారులు నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయ ప్రాంగణంలోకి గుంపులుగా చేరుకుని, ఆ భవనం ఎక్కి శ్రీలంక దేశ పతాకాన్ని ఎగురవేశారు. శ్రీలంక అధ్యక్ష పదవికి మాట ప్రకారం గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) బుధవారం రాజీనామా చేయనున్నట్లు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద యప అబేయవర్థెన (Mahinda Yapa Abeywardena) ప్రకటన చేశారు. 73 ఏళ్ల గొటబాయ రాజపక్స బుధవారం ఉదయం దేశం విడిచి మాల్దీవులకు వెళ్లిపోయారు.



గొటబాయ రాజీనామా విషయంపై అబేయవర్థెన మాట్లాడుతూ.. గొటబాయ తనకు ఫోన్ చేశారని, చెప్పినట్టుగానే తాను బుధవారం రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను పంపిస్తానని చెప్పారని తెలిపారు. జులై 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని, అప్పటివరకూ దేశ పౌరులు సంయమనం పాటించాలని శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ అభ్యర్థించారు.

Updated Date - 2022-07-13T22:10:14+05:30 IST