మరో 500 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకారం : అలీ సబ్రీ

ABN , First Publish Date - 2022-04-23T19:36:52+05:30 IST

శ్రీలంకకు చేయూతనివ్వడంలో భాగంగా మరొక 500 మిలియన్ డాలర్ల

మరో 500 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు భారత్ అంగీకారం : అలీ సబ్రీ

కొలంబో : శ్రీలంకకు చేయూతనివ్వడంలో భాగంగా మరొక 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఉద్దీపన ప్యాకేజీని తయారు చేయడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సొమ్మును ఇంధన దిగుమతుల కోసం శ్రీలంక వినియోగిస్తుంది. ఈ వివరాలను శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రి చెప్పారు. 


శ్రీలంక విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇటీవలి కాలంలో తీవ్రంగా క్షీణించాయి. ఫలితంగా ఆ దేశ కరెన్సీ విలువ పతనమైంది, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో దిగుమతులకు చెల్లించవలసిన సొమ్ము కోసం అనేక అవస్థలు పడుతోంది. 


అలీ సబ్రీ మాట్లాడుతూ, ఇంధన దిగుమతి కోసం శ్రీలంకకు అదనంగా 500 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని, మరొక 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడంపై భారత ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


ఉద్దీపన ప్యాకేజీపై ఐఎంఎఫ్‌తో చర్చించేందుకు అలీ సబ్రీ ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఉన్నారు. ఆసియన్ క్లియరింగ్ యూనియన్‌కు శ్రీలంక చెల్లించవలసిన 1.5 బిలియన్ డాలర్ల దిగుమతుల చెల్లింపులను వాయిదా వేసేందుకు భారత దేశం అంగీకరించింది. 


ఇంధనం, ఆహార పదార్థాలు, విద్యుత్తు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడంతో శ్రీలంక ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. 


Updated Date - 2022-04-23T19:36:52+05:30 IST