Sri Lanka Crisis: పిరికి, అనాగరిక చర్య: ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న శ్రీలంక

ABN , First Publish Date - 2022-05-10T22:40:38+05:30 IST

శ్రీలంక సంక్షోభం పరాకాష్టకు చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత

Sri Lanka Crisis: పిరికి, అనాగరిక చర్య: ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న శ్రీలంక

కొలంబో: శ్రీలంక సంక్షోభం పరాకాష్టకు చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత దుర్భర స్థితికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక క్రికెటర్లకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో వారి మాటలకు విలువ ఎక్కువ. ఇక, శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం , ఫలితంగా చెలరేగిన రాజకీయ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికిపైగా గాయపడడంపై ఆ దేశ క్రికెట్ దిగ్గజం మహేల జయవర్దనే స్పందించాడు. తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న శాంతియుత నిరసనకారులపైకి ప్రభుత్వ మద్దతుతో దుండగులు, గూండాలు దాడి చేయడం చూస్తుంటే అసహ్యమేస్తోందని అన్నాడు. 


శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర మాట్లాడుతూ.. ఈ హింస వెనక ప్రభుత్వం ఉందని, ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస ఇదని ఆరోపించాడు. ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్ధనే ఓ వీడియోను ట్వీట్ చేశాడు. అందులో కొంతమంది కలిసి ఓ మహిళపై దాడిచేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన జయవర్ధనే.. ‘‘పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను ఎలా కొడుతున్నారో చూడండి.. సిగ్గు చేటు’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేశారు.  


లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. అమయాక, శాంతియుత నిరసనకారులపై జరిగిన దాడిని పిరికి, అనాగరిక చర్యగా అభివర్ణించాడు. మన దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఏకమైన అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చాడు. శాతంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక ప్రజలపై వ్యవస్థీకృత దాడులు జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌వెల్లా అన్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. 



Read more