శ్రీలంకలో లంగరేయనున్న చైనా నౌక

ABN , First Publish Date - 2022-08-14T08:37:06+05:30 IST

లేదులేదంటూనే చైనా నిఘా నౌక యున్‌ వాంగ్‌-5ను శ్రీలంక అనుమతించింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఆ నౌకను తమ తీరప్రాంతానికి..

శ్రీలంకలో లంగరేయనున్న   చైనా నౌక

కొలంబో, ఆగస్టు 13: లేదులేదంటూనే చైనా నిఘా నౌక యున్‌ వాంగ్‌-5ను శ్రీలంక అనుమతించింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఆ నౌకను తమ తీరప్రాంతానికి తేవొద్దంటూ ఇటీవలే విజ్ఞప్తి చేసినా.. శుక్రవారం అనుమతి జారీ చేసింది. దాంతో.. ప్రస్తుతం చైనా నౌక శ్రీలంక వైపు వస్తోంది. ఈ నౌక దక్షిణ భారతంతోపాటు.. ఒడిసాలోని చాందీపూర్‌లో ఉన్న క్షిపణి పరీక్ష కేంద్రాలను తన రాడార్‌ పరిధిలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ నెల 11నే ఈ నౌక శ్రీలంకలోని హంబనటొట నౌకశ్రాయానికి చేరుకోవాల్సి ఉండగా.. భారత్‌ అభ్యంతరాలపై స్పందిస్తూ.. ఈ నెల 6న చైనాకు లేఖ రాసింది. తదుపరి నిర్ణయం తీసుకునేదాకా చైనా నౌకను అనుమతించబోమని పేర్కొంది. అయితే.. ఉన్నఫళంగా ఆ నౌకకు అనుమతించినట్లు శ్రీలంక ప్రభుత్వం శనివారం ప్రకటించింది.


ఈ నెల 16-22 తేదీల మధ్య చైనా నౌక తమ తీరానికి వస్తుందని పేర్కొంది. అయితే.. ముందు నుంచి శ్రీలంక తీరు అనుమానాస్పదంగా ఉండడం గమనార్హం. మొదట్లో తాము అణు నౌకలను అనుమతించబోమని.. యున్‌ వాంగ్‌-5 సాధారణ నౌక కావడం వల్లే అనుమతినిచ్చామని పేర్కొంది. ఆ తర్వాత కేవలం ఇంధనం నింపుకోవడానికే ఆ నౌక వస్తోందని వెల్లడించింది. ఆ వెంటనే అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపింది. 

Updated Date - 2022-08-14T08:37:06+05:30 IST