India నుంచి మా దేశానికి రావొద్దు : శ్రీలంక

ABN , First Publish Date - 2021-05-06T19:49:35+05:30 IST

భారత్ నుంచి మా దేశానికి రావొద్దు అంటున్న దేశాల సంఖ్య పెరుగుతోంది

India నుంచి మా దేశానికి రావొద్దు : శ్రీలంక

న్యూఢిల్లీ : భారత్ నుంచి మా దేశానికి రావొద్దు అంటున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్-19 రెండో ప్రభంజనం తీవ్రంగా ఉండటంతో బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు ఇప్పటికే భారతీయ ప్రయాణికులపై నిషేధం విధించాయి. ఆ జాబితాలో తాజాగా శ్రీలంక చేరింది. 


శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశం నుంచి శ్రీలంకకు జరిగే ప్రయాణాలపై పూర్తిగా నిషేధం విధించినట్లు తెలిపింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను శ్రీలంకలోకి అనుమతించేది లేదని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. భారత్‌లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్తు తెలిపింది. ఈ ఆదేశాలను శ్రీలంక ఎయిర్‌లైన్స్ సీఈఓకు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఓ లేఖ ద్వారా పంపించారు. శ్రీలంక ఆరోగ్య శాఖాధికారుల సూచనల మేరకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. 


మన దేశం నుంచి పశ్చిమాసియా, సింగపూర్ వెళ్ళే ప్రయాణికులకు శ్రీలంక ఓ మజిలీ కేంద్రంగా ఉంది. ట్రావెల్ బబుల్‌లో భాగంగా ఇండియన్ టూరిస్టులను శ్రీలంక టూరిజం అధికారులు అనుమతించవలసి ఉంటుంది. 


ఇదిలావుండగా, మన దేశంలో రోజువారీ కొత్త కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, గడచిన 24 గంటల్లో కొత్తగా 4,12,262 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 2,30,168కి చేరింది.


శ్రీలంకలో గడచిన ఐదు రోజుల్లో రోజుకు సుమారు 2,000 చొప్పున కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2021-05-06T19:49:35+05:30 IST