విదేశీ రుణాలను కొంత కాలం చెల్లించలేం : శ్రీలంక

ABN , First Publish Date - 2022-04-12T20:10:04+05:30 IST

అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక విదేశీ రుణాలను

విదేశీ రుణాలను కొంత కాలం చెల్లించలేం : శ్రీలంక

కొలంబో : అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక విదేశీ రుణాలను కొంత కాలంపాటు తిరిగి చెల్లించలేమని మంగళవారం ప్రకటించింది. తమకు అప్పులిచ్చిన రుణదాతలు, విదేశీ ప్రభుత్వాలు మంగళవారం మధ్యాహ్నం నుంచి వడ్డీ బాకీలను అసలు రుణంలో కలుపుకోవాలని తెలిపింది. లేదంటే శ్రీలంక కరెన్సీలో తిరిగి పొందవచ్చునని పేర్కొంది. శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 


51 బిలియన్ డాలర్ల మేరకుగల  ప్రభావిత రుణాల సాధారణ రుణ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మద్దతుగల ఆర్థిక సర్దుబాటు పథకానికి అనుగుణంగా ఈ రుణాలను క్రమబద్ధమైన, పరస్పర సమ్మతితో కూడిన పునర్వ్యవస్థీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. 2022 ఏప్రిల్ 12నాటికి బాకీ ఉన్న ‘‘ప్రభావిత రుణాల’’కు ప్రభుత్వ విధానం వర్తిస్తుందని తెలిపింది. ఈ తేదీ తర్వాత నూతన రుణ సదుపాయాలు, అదేవిధంగా ప్రస్తుత రుణ సదుపాయాల ప్రకారం విడుదలైన మొత్తాలకు ఈ విధానం వర్తించదని, వీటికి మామూలుగానే సేవలందిస్తామని వివరించింది. 


రుణదాతల పరిశీలన కోసం ఓ రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్‌‌ను సమర్పించే వరకు అన్ని ప్రభావిత రుణాల దాతలు ఈ మధ్యంతర కాలంలో తమకు రావలసిన అసలు, వడ్డీ సొమ్మును అసలులో కలుపుకోవాలని తెలిపింది. సంబంధిత రుణానికి వర్తించే సాధారణ కాంట్రాక్చువల్ రేటుకు మించని వడ్డీ రేటును వర్తింపజేసుకోవాలని పేర్కొంది. 


శ్రీలంకలో పన్నుల కోత, ఆర్థిక వనరుల నిర్వహణ లోపాల కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో 2 కోట్ల 20 లక్షల మంది జనాభాకు మౌలిక అవసరాలు తీరడం కష్టంగా మారింది. ఏప్రిల్ 3న కేబినెట్ మంత్రులు రాజీనామా చేయడంతో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. 


విదేశీ మారక ద్రవ్య లోటు కూడా శ్రీలంకను వేధిస్తోంది. దీంతో ఆహారం, ఇంధనం, విద్యుత్తు, గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మిత్ర దేశాల సహాయం కోసం ఎదురు చూస్తోంది. మన దేశం ఏప్రిల్ 2న 40,000 ఎంటీల డీజిల్‌ను పంపించింది. మన దేశం పంపించిన 11,000 ఎంటీల బియ్యం మంగళవారం శ్రీలంకకు చేరుకుంది. చంద్రోదయాన్నిబట్టి ఏప్రిల్ 13 లేదా 14 తేదీల్లో శ్రీలంకలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. గత వారంలోనే శ్రీలంకకు బహుముఖ మద్దతులో భాగంగా మన దేశం 16,000 ఎంటీల బియ్యాన్ని పంపించింది. అంతేకాకుండా ఇంధనం, కూరగాయలు, రోజువారీ అవసరమయ్యే రేషన్ సరుకులు వంటివాటిని కూడా పంపిస్తోంది. ఇప్పటి వరకు 2,70,000 ఎంటీల ఇంధనాన్ని పంపించింది. 1 బిలియన్ డాలర్ల రుణ సహాయాన్ని కూడా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధానికి ఇది నిదర్శనం. 


Updated Date - 2022-04-12T20:10:04+05:30 IST