ప్రాతఃస్మరామి లలితా...

ABN , First Publish Date - 2021-02-26T05:40:53+05:30 IST

ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత, పంచదశాక్షరీ మంత్రాధిదేవత. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీ లలితా దేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

ప్రాతఃస్మరామి లలితా...

రేపు శ్రీ లలితా జయంతి


ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత, పంచదశాక్షరీ మంత్రాధిదేవత. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీ లలితా దేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి.


‘మఘము’ అంటే యజ్ఞం. యజ్ఞ, యాగాలూ, పవిత్రమైన దైవ కార్యాలూ చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర, నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపో నిష్టకు మెచ్చి, ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే... ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలనీ, శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. వర గర్వంతో విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక... నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహా యాగం చేశారు. ఆ హోమ గుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి, శ్రీచక్రాన్ని అధిష్ఠించి, భండాసురుణ్ణి సంహరించింది.


ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి దేవతలు, మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే ‘శ్రీ లలితా సహస్రనామం’గా ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి. 


సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ‘లలితా సహస్రనామా’న్ని పఠిస్తారు. అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ, పాశాన్నీ, అంకుశాన్నీ, పుష్పబాణాలనూ, ధనస్సునూ నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీ లలితా దేవిని భయాన్ని పోగొట్టి, శాంతిని ప్రసాదించే తల్లిగా  కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి, లలితాసహస్రనామ పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ, కళల్లో ప్రావీణ్యాన్నీ, కుటుంబ సౌఖ్యాన్నీ, ప్రశాంతతనూ, సంపదనూ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక. ప్రత్యేకించి, శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున... పవిత్ర స్నానాలు చేసి, లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ, అలాగే ‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం...’  అంటూ ప్రారంభమయ్యే ‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’ పారాయణ కూడా విశేష ఫలప్రదమనీ పెద్దల మాట. ఫ 


సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ‘లలితా సహస్రనామా’న్ని పఠిస్తారు.


మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర, నదీ స్నానాలు, పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత. 

Updated Date - 2021-02-26T05:40:53+05:30 IST