నృసింహుని సన్నిధిలో జగన్నాటకం.. పానకం సొమ్మేది స్వామి

ABN , First Publish Date - 2021-09-08T05:32:22+05:30 IST

మంగళాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి..

నృసింహుని సన్నిధిలో జగన్నాటకం.. పానకం సొమ్మేది స్వామి
పానకాల నృసింహస్వామివారి ఆలయం

ఇంతవరకు జమ చేయని పాటదారుడు

గత నెల 27 నుంచే హక్కుల బదలాయింపు

నృసింహాలయ అధికారుల ఉదారతలో మతలబేమిటో?


మంగళగిరి(గుంటూరు): మంగళాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఎగువ సన్నిధిలోని పానకం విక్రయ తయారీ హక్కు వేలంలో జగన్నాటకం వెలుగుచూసింది. సృష్టిలో భక్తులు నివేదించే నైవేద్యాన్ని స్వయంగా ఆరంగించే దేవుడు ఒక్క మంగళాద్రి నృసింహుడు మాత్రమే. సరిగ్గా ఈ విశిష్టతే ఈ క్షేత్రానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. క్షేత్ర ఆచారాన్ని బట్టి పానకాన్ని ఎగువ సన్నిధిలో తయారుచేసి భక్తులకు బిందెల లెక్కన ఏడాదిపాటు విక్రయించుకునేలా ఆలయ అధికారులు ఏటా బహిరంగ వేలం నిర్వహిస్తారు. వేలం పూర్తయిన వెంటనే పాట తాలూకు మొత్తం సొమ్మును వెంటనే ఒకేసారి చెల్లించే ఆనవాయితీని దేవస్థానం కొనసాగిస్తూ వస్తుంది. ఈ పర్యాయం సదరు ఆనవాయితీకి అధికారులు గండి కొట్టేశారు. నృసింహుని వార్షిక ఆదాయంలో ఈ పానకం వేలంపాట తాలూకు ఆదాయం సుమారు 20నుంచి 25శాతం ఉంటుంది. ఇపుడు ఈ ఆదాయానికే గండిపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని పలువురు అంటున్నారు. ఈ ఏడాది పానలకాల నృసింహస్వామివారి పానకం వేలం ఆదాయం రూ.1.35 కోట్లు. ఇది కాగితాల మీద మాత్రమే ఉంది. ఇంతవరకు ఆ మొత్తం నృసింహుని ఖాతాలోకి ఇంకా జమ కాలేదు.


ఇదేమి మినహాయింపు?

పానకం తయారీ హక్కు భుక్తాయింపుకు 2021-22 సంవత్సరానికి గత జూలై నుంచి ఆలయ అధికారులు బహిరంగవేలం పెట్టే ప్రయత్నం చేశారు. స్పందన లేక మూడు సార్లు వాయిదాలు పడి నాలుగోసారి ఒకే అయింది. ప్రహ్లాద ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు మరో ముగ్గురు రూ.5 లక్షలను డిపాజిట్‌గా చెల్లించి పాటలో పాల్గొన్నారు. అయితే ఈ పాటలో కన్నా సీల్డ్‌ టెండరులో ప్రహ్లాద ఎంటర్‌ప్రైజెస్‌ గరిష్ఠ మొత్తాన్ని కోడ్‌ చేయడం.. అది కూడా సింగిల్‌ టెండర్‌ కావడంతో ఆలయ అధికారులు దానినే ఖరారు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.9 లక్షలు ఎక్కువగా రూ.1.35 కోట్లకు ప్రహ్లాద ఎంటర్‌ప్రైజెస్‌ పానకం తయారీ, విక్రయ హక్కు దక్కించుకుంది. అయితే పాట తాలూకు మొత్తాన్ని నిబంధనల ప్రకారం అక్కడికక్కడే చెల్లించాలి. ప్రహ్లాద ఎంటర్‌ప్రైజెస్‌ డిపాజిట్‌ సొమ్ము రూ.5 లక్షలు మినహా ఇంకేమీ చెల్లించలేదు.


అయినా గతనెల 27 నుంచి పానకం తయారీ, విక్రయ హక్కులను అధికారులు పాటదారుడికి బదలాయించేశారు. ఇటీవలే ఇన్‌చార్జి ఈవోగా వచ్చిన రామకోటిరెడ్డి పానకం వేలం సొమ్మును కట్టలేదమని పాటదారుడ్ని ప్రశ్నించగా.. గతంలో ఉన్న ఈవో దశలవారీగా చెల్లించుకునే అవకాశం ఇచ్చినట్లు చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంలో పాటదారుడికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల మద్ధతు కూడా ఉందని సమాచారం. నిబంధనల ప్రకారం పాట సొమ్మును ఏకమొత్తంగా చెల్లించనిపక్షంలో సదరు పాటను రద్దు చేసే అధికారం ఈవోకు ఉంటుంది. కానీ, ఇక్కడ వేలంను రద్దు చేయకపోగా హక్కులను గతనెల 27నే అప్పగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో దాగివున్న ఆ మతలబు ఏమిటో ఇక ఆ నృసింహునికే తెలియాలి

Updated Date - 2021-09-08T05:32:22+05:30 IST